ఏపీలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు బుధవారం విడుదల అయ్యాయి. ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయవాడలో ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. మే 6 నుంచి 25 వరకు జరిగిన ఇంటర్ పరీక్షలకు 9లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను www.bie.ap.gov.in, https://examresults.ap.nic.in వెబ్‌సైట్‌లో పొందవచ్చు. ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరైన విద్యార్థులు 4, 45, 604 మంది. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులు 4 లక్షల 23 వేల 455 మంది. ఒకేషనల్ పరీక్షలు రాసిన విద్యార్థులు 72వేల 299 మంది. మొత్తంగా పరీక్షలకు హాజరైన విద్యార్థులు 9,41,358 మంది. తొలిసారిగా సీసీ కెమేరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించింది ఇంటర్ బోర్డు.
ఇంటర్ ఫలితాలను విడుదలచేశామని, సీడీ పాస్ వర్డ్ అందుబాటులో వుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. మార్చిలో జరగాల్సిన పరీక్షలను మేనెలలో నిర్వహించామన్నారు. స్పాట్ వాల్యుయేషన్ వేగంగా పూర్తిచేశాం. ఈ పరీక్షల్లో రికార్డ్ స్థాయిల్లో 28 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేశామన్నారు. మొదటి సంవత్సరం 54 శాతం, సెకండియర్ లో ఉత్తీర్ణత శాతం 61 శాతంగా వుందన్నారు. ఫస్టియర్ లో బాలురు 49 శాతం, బాలికలు 60 శాతం పాసయ్యారు. సెకండియర్ లో బాలురు 54 శాతం, బాలికలు 68 శాతం పాసయ్యారు.
మొదటి సంవత్సరం 4,45,604 మంది పరీక్షలు రాయగా 2,41,591 మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి ఏడాది 54శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరం 4,23,458 పరీక్షలు రాస్తే ఉత్తీర్ణులైన వారు 2,58,449. ఇంటర్ ఫలితాల్లో దుమ్ము రేపారు బాలికలు. ఉమ్మడి జిల్లాల్లో టాప్ లో కృష్ణా జిల్లా వుంది. కృష్ణా జిల్లాలో 72 శాతం, చివరి ప్లేస్ లో కడప 50 శాతంగా వుంది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు జూన్ 25 నుంచి జూలై 5 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం వుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.