Minister Botsa Satyanarayana Meeting with Employees Union Leaders: ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహా సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు.ఉద్యోగుల సమస్యలు, పరిష్కారంపై చర్చల్లో భాగంగా బొత్స నివాసానికి ఉద్యోగ సంఘాల నేతలు, బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, ఇతర నాయకులు వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య, ఏపీ ఎన్జీవోల సంఘం ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని కోరామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. రెండు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని అడిగామని చెప్పారు. ఎన్నికల కోడ్ ఉన్నందున పెండింగ్ డీఏలు ఇవ్వలేకపోయామని చెప్పారని ఆయన వెల్లడించారు. ఎన్నికల కోడ్ ముగిశాక పెండింగులో ఉన్న డీఏల్లో ఒక డీఏ ఇస్తామని స్పష్టం చేశారని పేర్కొన్నారు.
Read Also: Bachula Arjunudu:అనారోగ్యంతో కన్నుమూసిన టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు
“కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని.. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం భూ కేటాయింపులు చేస్తామని ప్రభుత్వం చెప్పింది సీపీఎస్ ఉద్యమంలో పెట్టిన కేసులను ఎత్తేస్తామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో బదిలీలకు త్వరలోనే గ్రీన్ సిగ్నల్. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం సర్వీస్ రూల్స్, జాబ్ ఛార్ట్ సిద్దం చేస్తామని మంత్రి బొత్స, సజ్జల హామీనిచ్చారు. గత ప్రభుత్వంలోనే ఉద్యోగ సంఘాల నేతలను టార్గెట్ చేసుకుని ఏసీబీ దాడులు జరిగాయి. గత ప్రభుత్వం మూడు కులాల ఉద్యోగులను లక్ష్యంగా పెట్టుకుని ఏసీబీ దాడులు చేపట్టింది. అప్పటి సీఎం సొంత సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగులపై ఏసీబీ దాడులు చేయలేదు. గతంలో 170 మంది ఉద్యోగులపై ఏసీబీ దాడులు చేయించింది. ఈ ప్రభుత్వంలో ఉద్యోగ సంఘాల నేతలపై ఏసీబీ దాడులు చేయించనే లేదు. నేను సీఎం జగన్ బంటునే. ప్రభుత్వాధినేత సీఎం కాబట్టి నేను జగన్ బంటునే. నన్నే ఓడించ లేకపోయారు.. సీఎం జగన్నేం ఓడిస్తారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్న ప్రభుత్వం ఇది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఉద్యోగులను కోరుతున్నాం. రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు ఆలస్యంగా వస్తున్నా.. చిరుద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు పడుతున్నాయి. గత ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ఒక్క నెలలో అయినా ఒకటో తేదీన జీతాలు పడ్డాయా..?” అని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్ వెంకట్రామి రెడ్డి అన్నారు.
