Botsa Satyanarayana: ఏపీ ఈఏపీ సెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసిన చేశారు. ఇంజనీరింగ్‌లో మొత్తం 2,24,724 మందికి గానూ 1,71,514 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్‌లో 90,573 మందికి గానూ, 81,203 మంది అభ్యర్థులు క్వాలిపై అయ్యారు. ఇంజనీరింగ్ విభాగంలో అత్యధిక మార్కులు సాధించిన టాప్ టెన్ జాబితాలో ఈసారి అంతా బాలురే ఉన్నారు. ఇంజనీరింగ్ విభాగం మొదటి ర్యాంకు158 మార్కులతో ఉమేష్ వరుణ్ అగ్రస్థానంలో ఉన్నారు. తెలంగాణ ఎంసెట్‌లో కూడా వరుణ్ మూడవ ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో 153 మార్కులతో జశ్వంత్ మొదటి ర్యాంకు సాధించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఏపీ విద్యా రంగంలో టాప్ స్టేట్ కానుందని మంత్రి పేర్కొన్నారు. టాప్ టెన్‌లో అమ్మాయిల సంఖ్య తక్కువ ఉన్నా… ఉత్తీర్ణత శాతంలో అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారన్నారు. విద్యలో ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం విద్యార్థుల మంచి భవిష్యత్ కోసమేనని ఆయన అన్నారు. విద్య కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి రాష్ట్ర అభివృద్దికేనని మంత్రి తెలిపారు. విద్య పట్ల ప్రతీ ఒక్కరికి శ్రద్ద పెరిగిందన్నారు. జులై 15 నుంచి ఆగస్టు 15 మధ్య కౌన్సెలింగ్ నిర్వహించే ఆలోచనలో ఉన్నత విద్యా మండలి ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.
Also Read: Hyderabad Girl: లండన్ లో తెలంగాణ యువతి మృతి.. కత్తితో దాడి చేసి చంపిన యువకుడు
ఇటీవల విశాఖలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. అమిత్ షా చెప్పేంత వరకు జీవీఎల్ కు తెలియదా అంటూ మండిపడ్డారు. విశాఖలో భూదందా నిజంగా జరిగితే ఎందుకు అడగలేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే అమిత్ షా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి పొందాలనే ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇన్నేళ్ళూ టీడీపీ చెప్పిన మాటలనే ఇవాళ బీజేపీ నేతలు చెబుతున్నారని .. రాష్ట్రం అభివృద్ది చెందుతుందనే కడుపు మంటతో గురువింద గింజ లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. దేశంలో ఏం జరుగుతుందో వాళ్ళు చూసుకుంటే మంచిదన్నారు. ముష్టి వేసినట్లు నిధులు ఇస్తున్నారన్న మండిపడిన మంత్రి.. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ గురించి గతం నుంచే అడుగుతున్నామన్నారు. కేంద్రం నుంచి వచ్చే వారు ఒక విజన్‌తో మాట్లాడాలన్నారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులు మన హక్కు అంటూ మంత్రి తెలిపారు. మనం చెల్లిస్తున్న పన్నులే కదా వాళ్లు ఇచ్చేదంటూ మంత్రి తెలిపారు. రెండు వందేమాతరం రైళ్ళు ఇచ్చాం అని అమిత్ షా చెప్పటం సిగ్గు చేటన్నారు. అదనంగా కేంద్రం ఏం ఇచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు.
Also Read: Pawan Kalyan Varahi Yatra: అన్నవరంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు
టీడీపీ చెప్పిన మాటలనే అమిత్ షా ఉటంకించారని.. బీజేపీ వాళ్ళ ఆలోచన ఏమయ్యిందని ప్రశ్నించారు. మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు… ఉండదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. దేశ గౌరవానికి సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.