NTV Telugu Site icon

Botsa Satyanarayana: మేలు చేస్తేనే ఓటేయండని అడిగిన జగన్.. దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు..

Botsa Satyanarayana

Botsa Satyanarayana

Botsa Satyanarayana: ఏపీలో ఎన్నికల ఫలితాలపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. వెరీ క్లారిటీగా ఉన్నామని.. 175 సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మేం మేలు చేస్తేనే ఓటేయండని అడిగిన జగన్.. దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారన్నారు. జగన్ అడిగిన విధంగా మోడీ కూడా ధైర్యంగా ఓట్లడగలేకపోతున్నారన్నారు. పరిపాలన చూసి ఓటేయండని ప్రధాని కూడా అడగలేకపోయారన్నారు. దేశానికి మేలు చేశానని.. ఓటేయ్యండి అని మోడీ కూడా అడగడం లేదన్నారు. రామాలయ నిర్మాణం, సీతమ్మ భూమి, ముస్లిం రిజర్వేషన్లు వంటి వాటిని ప్రస్తావిస్తూ ప్రధాని ఓట్లు అడుగుతున్నారన్నారు.

ఎన్నికలయ్యాయి.. ఫలితాలు రావాల్సి ఉందన్నారు. ఎవరి ధీమా వారికుందన్నారు. మేం ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్దంగా ఉన్నామని చెప్పామన్నారు. ప్రతిపక్షంలో కూడా వారు చెప్పాల్సింది చెబుతున్నారని.. ఎన్నో ఎన్నికలు చూశాను కానీ.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని మంత్రి చెప్పారు. ఇప్పుడు ప్రధాన రాజకీయ నేతలంతా విదేశాల్లో ఉన్నారన్నారు. జగన్ విదేశీ పర్యటన మీద రకరకాల విమర్శలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. చంద్రబాబు.. లోకేష్ కూడా విదేశాలకు వెళ్లిపోయారని.. ముఖ్య నేతలు విదేశాల్లో ఉన్నారు.. ఇంకొందరు నేతలు ప్రయాణాల్లో ఉన్నారని.. ఇక్కడున్న వారు ఇప్పుడు ఎందుకు గొడవ చేస్తున్నారని ప్రశ్నించారు. కొంత గ్యాప్ ఇవ్వాలని ఆయన సూచించారు.

చంద్రబాబు ఎక్కడికెళ్లారో ఎందుకు చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. చెప్పాల్సిన అవసరం లేదంటే సరే కానీ.. అటువంటప్పుడు జగన్ పర్యటనల మీద ఎందుకింత చర్చ అంటూ ఆయన పేర్కొన్నారు. విద్యా వైద్యంలో తమపై ఇంకా ఆరోపణలు చేస్తున్నారని.. కూటమి మేనిఫెస్టోలో విద్యా రంగంపై హామీలు ఎందుకివ్వలేదని మంత్రి ప్రశ్నించారు. ఇప్పుడు 1-10 తరగతుల్లో 39,61,198 మంది విద్యార్థులున్నారని.. వైసీపీ హయాంలో విద్యా విధానం దేదీప్యమానంగా వెలిగిందన్నారు. విద్యార్థుల కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టామన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యా విధానం మెరుగయ్యేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.