NTV Telugu Site icon

Minister Atchannaidu: ఏ ఒక్క రైతుకూ ఆదాయం తగ్గకూడదు.. వ్యవసాయ మంత్రి కీలక ఆదేశాలు

Atchannaidu

Atchannaidu

Minister Atchannaidu: రాయలసీమ జిల్లాల్లోని ఏ ఒక్క రైతు ఆదాయం తగ్గకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. సీమ జిల్లాల్లో ఖాళీగా ఉన్న వ్యవసాయ భూముల్లో సాగు ప్రోత్సహించడంతో పాటు రైతులకు మేలు చేకూర్చేందుకు 80 శాతం రాయితీపై విత్తనాలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు రాయలసీమ లోని 8 జిల్లాల వ్యవసాయ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో డిమాండ్ ఉన్న పంటలకు, రైతులు కోరుకునే రకాల విత్తనాలు సిద్దం చేయడంతో పాటు అటువంటి విత్తనాలకు రాయితీ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

Read Also: Minister Parthasarathy: వంద రోజుల్లో 1.20 లక్షల ఇళ్ల నిర్మాణమే మా లక్ష్యం!

సాగుకు దూరంగా ఉన్న భూముల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి రైతులకు సూచనలివ్వాలని అధికారులకు తెలియచేశారు. ప్రత్యామ్నాయ పంటల వాస్తవ అంచనాలను రూపొందించాలని, రైతులకు సాధారణ సాగులో ఆదాయం తగ్గకుండా ప్రత్యమ్నాయ పంటలను సూచించాలని మంత్రి తెలిపారు. ఇప్పటికే సాగులో ఉన్న పంట దిగుబడులు తగ్గకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సాధారణ స్థాయి కంటే అధిక వర్షపాతం ఉన్నా సాగు మాత్రం తక్కువ విస్తీర్ణంలో నమోదు అవడం వల్ల స్వల్పకాలంలో దిగుబడి వచ్చే పంటలను ప్రోత్సహించాలని తెలిపారు. ఒకేసారి వర్షం అధికంగా పడడం, ఎక్కువగా డ్రై స్పెల్స్ నమోదు అవడం వల్ల సాగు విస్తీర్ణం తగ్గిందని అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో ఇప్పటివరకు నమోదైన వర్షపాత వివరాలు, వివిధ పంటల సాగు విస్తీర్ణం, పంట సాగు చేయని మిగిలిన విస్తీర్ణంలో అనుకూలమైన ప్రత్యామ్నాయ పంటల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు. రాయలసీమ జిల్లాల వ్యవసాయ అధికారులు ఆయా జిల్లాల్లోని వ్యవసాయ క్షేత్ర పరిస్థితులను మంత్రి అచ్చెన్నాయుడు, అధికారులకు వివరించారు. గత ఏడాది జూన్ మాసం నుండి ఇప్పటి వరకు నెలవారీగా వాస్తవ పంటల సాగు విస్తీర్ణము, వర్షపాతం వివరాలను వివరించారు. వర్షం నమోదైన రోజులు తదితర పరిస్థితులను సాధారణ సాగు విస్తీర్ణము తదితర అంశాలతో బేరీజు చేస్తూ చర్చించారు.

Read Also: Teachers: వాగు దాటుతుండగా ఇద్దరు టీచర్లు మృతి.. వారి కుటుంబసభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం

వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ డిల్లీ రావు మాట్లాడుతూ.. రాయలసీమ జిల్లాల్లో 15,03,613 హెక్టార్ల సాధారణ సాగు విస్తీర్ణంనకు గాను, ఇప్పటివరకు 11,24,351 హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ పంటలు సాగుయిందని తెలిపారు. 3,79,262 హెక్టార్ల విస్తీర్ణంలో ఎటువంటి పంటలు సాగు చేపట్టక.. ఆ సాగు భూములు ప్రస్తుతం ఖాళీగా నమోదయ్యాయని వెల్లడించారు. వాటి స్థానంలో ప్రత్యామ్నాయంగా 2,22,349 హెక్టార్ల అత్యధిక విస్తీర్ణంలో ఉలవలు, మిగిలిన విస్తీర్ణంలో పెసర, అలసందలు, జొన్న, కొర్ర, మినుము ,సజ్జ పంటలను సిఫారసు చేశారని తెలిపారు. వీటిపై జిల్లా వ్యవసాయ అధికారులు 80 శాతం విత్తన రాయితీ ప్రతిపాదనలపై టెండర్ల ప్రక్రియ చివరి అంకంలో ఉన్నదని, రానున్న రెండు రోజులలో సరఫరా ఏజెన్సీలను నియమించి విత్తన పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ శివప్రసాద్‌ తెలియజేశారు. జిల్లా వ్యవసాయ అధికారులతో వ్యవసాయ పరిశోధనా సంచాలకులు పాలడుగుల సత్యనారాయణ మాట్లాడుతూ.. పంటలు బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు తీసుకోవలసిన చర్యలను వివరించారు. ఈ చర్చలో పాల్గొన్న అధికారులు తమ ప్రాంతంలోని రైతులు ఎక్కువ మంది నవధాన్యాల సాగుపై ఆసక్తి చూపుతున్నారని, వాటిని కూడా పంపిణీ చేయాలని కోరారు.