NTV Telugu Site icon

Ambati Rambabu: పవన్ కల్యాణ్‌ది శునకానందం.. సంక్రాంతికి నేను వేసిన డ్యాన్స్ ఆనంద తాండవం

Ambati

Ambati

Ambati Rambabu: బ్రో సినిమాలో తన క్యారెక్టర్ పై కౌంటర్ అటాక్‌కు దిగారు మంత్రి అంబటి రాంబాబు.. బ్రో సినిమాను నేను చూడలేదు.. కానీ, బ్రో సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి అవమానించారని విన్నాను.. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పవన్ కల్యాణ్‌ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.. ఎవరో డబ్బులు పెట్టి తీసిన సినిమాలో తాను నటిస్తూ.. నా క్యారెక్టర్ పెట్టి ఆనంద పడుతున్నాడని మండిపడ్డారు. కానీ, నేను ఎవరి దగ్గరో డబ్బులు తీసుకుని, ప్యాకేజీలు తీసుకుని డ్యాన్స్ వేయను.. పవన్ కళ్యాణ్ ది శునకానందం అంటూ దుయ్యబట్టారు. సంక్రాంతికి నేను వేసిన డ్యాన్స్ ఆనంద తాండవం.. ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి అయిన ఆనందంగా పేర్కొన్న ఆయన.. నా డ్యాన్స్ సింక్ అవ్వలేదట.. నేను ఏమైనా డ్యాన్స్ మాస్టర్ నా? అంటూ నిలదీశారు. అయితే, పవన్ కల్యాణ్‌ రాజకీయాలకు సింక్ అవ్వడంటూ దుయ్యబట్టారు మంత్రి అంబటి రాంబాబు.

ఇక, పోలవరంపై చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు అంబటి రాంబాబు.. 1998 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు చంద్రబాబు ఎందుకు పోలవరం గురించి ఆలోచించ లేదు? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులపై చిత్తశుద్ధి లేని వ్యక్తి బాబు.. గాలేరు-నగరి ప్రాజెక్టును ఎందుకు పట్టించుకో లేదు? అని నిలదీశారు. అబద్దాలు చెబితే లోకేష్ లాంటి కొడుకు పుడతాడు అంటూ సెటైర్లు వేసిన ఆయన.. చంద్రబాబు మీడియా సమావేశంలో నవరసాలు పండించాడు.. చంద్రబాబు వంటి గొప్ప నటుడిని ఇంత వరకు నేను చూడలేదు.. రాష్ట్రానికి, ఇరిగేషన్ ప్రాజెక్టులకు పట్టిన శని చంద్రబాబు నాయుడు.. 2020లో వరదల వల్ల డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది.. డయాఫ్రమ్ వాల్ ను కాఫర్ డ్యామ్ పూర్తి చేసిన తర్వాత కట్టాలి.. కానీ, చంద్రబాబు ఎందుకు ప్రణాళిక లేకుండా డయాఫ్రమ్ వాల్ కట్టాడు? అప్రోచ్ ఛానెల్, స్పిల్ ఛానెల్ పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ కట్టడంతో నీరు వెళ్ళటానికి దారి మూసుకుని పోయింది.. పోలవరానికి పట్టిన శని చంద్రబాబు అంటూ విరుచుకుపడ్డారు.

మా ప్రభుత్వమే లోయర్, అప్పర్ కాఫర్ డ్యామ్‌లను పూర్తి చేసిందని తెలిపారు అంబటి.. బిల్లులు చేసుకోవటం కోసం, కమీషన్ల కోసం సగం సగం పనులు చేసి డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినటానికి కారణం అయ్యారు అని ఆరోపించారు. చంద్రబాబుది శని కాలు.. ప్రాజెక్టుల దగ్గర పెడితే ఏమవుతుందో అని భయంగా ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రం పూర్తి చేయాల్సిన పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు? అని ప్రశ్నించిన ఆయన.. పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది వైఎస్ రాజశేఖరరెడ్డి కాదని ఎవరైనా చెప్పగలరా? అని నిలదీశారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆర్ అండ్ ఆర్ తో సహా మొత్తం భారం కేంద్రానిదే.. కానీ, తానే కేంద్రాన్ని ఒప్పించానని అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. 2016లో ప్రాజెక్టును కేంద్రం నుండి తీసుకుంటూ.. 2013-14 రేట్ల ప్రకారం కట్టుకుంటామని చెప్పారు. ఇది రాష్ట్రానికి, పోలవరానికి చేసిన ఘోర అన్యాయం కాదా?.. నవయుగకు కాంట్రాక్టును మాత్రం 2016 రేట్ల ప్రకారం ఇచ్చాడు అని ఫైర్‌ అయ్యారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే స్వయంగా చెప్పారు.. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా మార్చారని అన్నారు మంత్రి అంబటి రాంబాబు.. 2018లో పోలవరం పూర్తి చేస్తాం అని అసెంబ్లీలో చెప్పిన చంద్రబాబు.. ఎందుకు పూర్తి చేయలేక పోయారో సమాధానం చెప్పాలన్నారు. నన్ను ఆంబోతు ఆంబోతు అంటున్నాడు.. నేను మాట్లాడలేనా? వయస్సులో పెద్దవాడని గౌరవం ఇస్తున్నా అన్నారు. ఆంబోతులకు ఆవులను సరఫరా చేసిన వాడు చంద్రబాబు.. అనలేనా? పోలవరం ప్రాజెక్టు గురించి చంద్రబాబు పిచ్చి మాటలు చెబుతున్నాడు.. అది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు మంత్రి అంబటి రాంబాబు.