NTV Telugu Site icon

Ambati Rambabu: కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యకు కారణం చంద్రబాబే..

Ambati Rambabu

Ambati Rambabu

Ambati Rambabu: టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు. చంద్రబాబు సత్తెనపల్లి సభ అట్టర్‌ఫ్లాప్ అయిందని కామెంట్స్ చేశారు. కానీ ప్రచారం మాత్రం ఆర్భాటంగా చెప్పుకున్నారన్నారు. సత్తెనపల్లి సభకు జనం రాకపోయినా అద్భుతం అనడం చంద్రబాబు ఖర్మ అంటూ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు సభకు జనం నుంచి స్పందన కరువైందన్నారు చంద్రబాబు ఒక రాజకీయ సైకో అంటూ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆయన ఒక్క నిజమైనా చెప్పారా.. అన్నీ అబద్ధాలేనని, చంద్రబాబును మించిన సైకో ఈ రాష్ట్రంలో ఎవరూ లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారం లేకపోతే బతకలేడని విమర్శించారు. చంద్రబాబు అధికారం కోసం ఎవరితోనైనా కలుస్తాడని.. తిట్టినవారిపై కూడా ప్రశంసలు కురిపిస్తారని మంత్రి ఎద్దేవా చేశారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క పేదవాడినైనా ధనవంతుడిని చేశారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు రూ. 2 లక్షల కోట్లు ఇచ్చారని అన్నారు. కోడెల శివప్రసాద్ మరణానికి తాను కారణమని నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.

Read Also:

40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు.. నువ్వు పేదల్ని ధనవంతుల్ని చేశావా అంటూ ప్రశ్నించారు. కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్యకు చంద్రబాబే కారణమన్న అంబటి రాంబాబు.. కోడెల ఉరివేసుకోవడానికి ప్రధాన కారణం చంద్రబాబేనని ఆరోపించారు. ఆయన కుటుంబానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబేనన్నారు. కోడెల శివప్రసాద్‌పై అనేక ఆరోపణలు వచ్చాయని, ప్రజలు ఫిర్యాదులు చేశారని.. వాటిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసి యాక్షన్ తీసుకునేందుకు ప్రయత్నం చేశామని చెప్పారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదని తెలిపారు. ఇదేమైనా అరాచమా? వేధింపులా? అని ప్రశ్నించారు. ఆ కేసులకు భయపడి కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం కంటే అబద్దం ఉంటుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబుబు తప్పిదం వల్లే పోలవరం ఆలస్యమైందని ఆయన ఆరోపణలు చేశారు. కాపర్‌ డ్యాం కట్టకుండా డయాఫ్రం వాల్‌ కట్టారని.. చంద్రబాబు తప్పిదం వల్ల రూ.2వేల కోట్లు నష్టం జరిగిందని మంత్రి అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం ఆంబోతులకు ఆవులను సరఫరా చేయడమేనని మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు, లోకేష్, కోడెల శివప్రసాద్‌ల కన్నా తాను వంద రెట్లు నీతిమంతుడునని తెలిపారు. తెలుగుదేశం వాళ్లకు కూడా అన్యాయం జరగకూడదని అనుకునే వ్యక్తిని తానని చెప్పారు.