VC Sajjanar : హైదరాబాద్ నగర వీధులు రాత్రివేళల్లో వేడుకల వేదికలుగా మారిపోతున్న దృశ్యాలు ఇటీవల తరచూ కనపడుతున్నాయి. ముఖ్యంగా యువత బర్త్‌డే వేడుకలను బహిరంగంగా, పబ్లిక్ రోడ్లపై నిర్వహించడం కొత్త నాయా ట్రెండ్‌గా మారింది. మితిమీరిన సందడి, మద్యం మత్తులో అప్రమత్తత లేకుండా చేసే చేష్టలతో ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. అర్ధరాత్రి వేళ రోడ్లపై శబ్దాలతో, పాటలతో, హంగామాతో సాగుతున్న ఈ పండుగలు శాంతిభద్రతలకు కూడా ముప్పుగా మారుతున్నాయి. తాజాగా ఉప్పల్‌లోని భగాయత్ రోడ్ వద్ద అర్ధరాత్రి జన్మదిన వేడుకలు చేసుకుంటున్న కొంతమంది యువకులు ఉప్పల్ పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. మితిమీరిన వేడుకలతో రోడ్డు మార్గాన్ని అడ్డగించి, ప్రజలకు అసౌకర్యం కలిగించడమే కాకుండా శాంతిభద్రతలకూ భంగం కలిగించారు. ఈ క్రమంలో ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డి, తన బృందంతో కలిసి అక్కడకు చేరుకుని యువకులను నిలదీశారు. ఇటువంటి చర్యలు తీవ్రంగా తీసుకుంటామని హెచ్చరించారు. ‘‘ఇంకోసారి ఇలా చేస్తే, కఠిన చర్యలు తప్పవు,’’ అని వార్నింగ్ ఇచ్చారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. సోమవారం తన ఎక్స్ ఖాతా (మాజీ ట్విట్టర్) ద్వారా వీడియోను షేర్ చేస్తూ, “నడిరోడ్డుపై ఇది వేడుకలు కాదు, అతి!” అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
“దోస్తులను పిలవడం, నడిరోడ్డు మీద వేడుకలతో హంగామా చేయడం, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం అన్నీ యువతకి ఒక ఫ్యాషన్ అయిపోయింది,” అని వ్యాఖ్యానించారు. ఫేమస్ కావాలనే మద్దతు లేని చర్యలు చేస్తున్నారని, పుట్టినరోజు వేడుకలను కుటుంబంతో ఇంట్లో జరుపుకోవాలని హితవు పలికారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. “బర్త్‌డే కదా అని వదిలేయకండి – రోడ్డుపై అల్లరి చేస్తే కేసులు తప్పవు,” అని హెచ్చరించారు.
సామాజిక మాధ్యమాల్లోనూ ఈ అంశంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘‘తమ్ముల్లు జర భద్రం.. బర్త్‌డే అంటే సెలబ్రేషన్ కావచ్చు కానీ అది నడిరోడ్లపై చేయాల్సిన పనికాదురా!’’ అంటూ కౌంటర్లు వేస్తున్నారు. ‘‘పుట్టిన రోజు ఆనందంగా జరుపుకోవడం మంచిదే.. కానీ అది ఇతరులకు అసౌకర్యం కలిగించేలా కాకూడదు’’ అనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
నడిరోడ్ల మీద ఇదేం అతి!!
దోస్తులను పిలవాలి.. నడిరోడ్డు మీదకు రావాలి. బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో నానా హంగామా చెయ్యాలి. రోడ్ల మీద వెళ్లే వారికి ఇబ్బందులు కలిగిన, అసౌకర్యానికి గురైన వారికేం పట్టదు.
నది రోడ్లపై ఇలా బర్త్ డే వేడుకలు యువతకు ఫ్యాషన్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఫేమస్… pic.twitter.com/Wu0hd0EgJj
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 2, 2025
