మిచౌంగ్ తుఫాన్ తో దెబ్బకు తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో విలవిలలాడుతున్నాయి. ఇక, నిన్న (మంగళవారం) బాపట్ల సమీపంలో తీరం దాటిన తుఫాన్ వాయుగుండంగా బలహీన పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా భారీగానే పడే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు.
ఇక, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతీ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు. తుఫాన్ ప్రభావం ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, నల్లగొండ జిల్లాల్లో సైతం పలు చోట్ల భారీ నుంచి అతీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.
కాగా, జనగామ, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ క్రమంలోనే ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో నిన్న జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో కలెక్టర్లు అలర్ట్ గా ఉండాలని ఆమె సూచించారు. ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన రేవంత్ రెడ్డి తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ధాన్యం తడవకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. తుఫాను ప్రభా వం ఎక్కువగా ఉన్న ఈశాన్య జిల్లాల్లో అధికారులు మరింత అలర్ట్ గా ఉండాలన్నారు.