ACB Raids: పేదరికాన్ని నిర్మూలించే అధికారే కుబేరుడు.. 1.7 కిలోల గోల్డ్, 12 ప్లాట్లు, 2 ఫ్లాట్లు.. 2 లగ్జరీ కార్లు.. ఇంకా ఎన్నో..

Mepma Additional Director Yadagiri Rao

Mepma Additional Director Yadagiri Rao

ACB Raids MEPMA Additional Director Yadagiri Rao: పేదరికాన్ని నిర్మూలించాల్సిన శాఖలోనే ఓ అధికారి కోట్లకు పడగలెత్తడం తీవ్ర కలకలం రేపింది. పట్టణ పేదల సంక్షేమం చూసే ‘మెప్మా’ (Mission for Elimination of Poverty in Municipal Areas) అడిషనల్ డైరెక్టర్ నల్లగట్ల (నల్లబోతు) యాదగిరి రావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ACB) సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారన్న పక్కా సమాచారంతో రంగారెడ్డి రేంజ్ ఏసీబీ బృందాలు ఆయన నివాసాలు, కార్యాలయాలు, బంధువులు, బినామీల ఇళ్లతో సహా మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశాయి. ఇప్పటివరకు జరిపిన ప్రాథమిక తనిఖీల్లోనే సుమారు రూ.4.75 కోట్ల విలువైన అక్రమాస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మార్కెట్ విలువ ప్రకారం (Market Value) వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

ఏసీబీ చేపట్టిన ఈ మెరుపు దాడుల్లో లభ్యమైన ఆస్తులు చూసి అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు. యాదగిరి పేరిట హైదరాబాద్, సూర్యాపేట ప్రాంతాల్లో ఉన్న 12 ఖాళీ ప్లాట్లు (Plots) గుర్తించారు. వీటి విలువ రూ. 58.63 లక్షలుగా ప్రాథమికంగా అంచనా వేశారు. హైదరాబాద్ ఉప్పల్ (Uppal) పరిధిలోనే రూ. 31.36 లక్షల విలువైన రెండు ఫ్లాట్లు (Residential Flats), రూ. 2 కోట్లకు పైగా విలువ చేసే G+3 భవనంతో పాటు ఓ పెంట్‌హౌస్ (Penthouse) ఉన్నట్లు తేలింది. వీటితో పాటు సూర్యాపేట జిల్లాలో ఒక ఆర్సీసీ ఇల్లు, ఉప్పల్‌లో ఒక దుకాణం కూడా బయటపడ్డాయి. ఇల్లు, భూములే కాకుండా విలాసవంతమైన జీవితానికి సంబంధించిన సామాగ్రి కూడా లభ్యమైంది.

నగదు, నగలు, వాహనాల రూపంలో భారీగా ఆస్తులు లభించాయి. తనిఖీల్లో దాదాపు 1.8 కేజీల (1,792.2 గ్రాములు) బంగారు ఆభరణాలు (Gold Jewellery) లభించాయి, వీటి విలువ రూ. 33.82 లక్షలుగా పేర్కొన్నారు. అలాగే రూ. 1.80 లక్షల విలువైన 3 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాహనాల విషయానికొస్తే ఒక టయోటా ఫార్చ్యూనర్ (Toyota Fortuner) తో పాటు మరో లగ్జరీ కార్ దొరికాయి, వీటి మొత్తం విలువ రూ. 73 లక్షలు ఉంటుందని అంచనా వేసారు. ద్విచక్ర వాహనాలు, రూ. 29.08 లక్షల విలువైన గృహోపకరణాలు, రూ. 7.01 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ (Electronic Gadgets), వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ. 32.30 లక్షల నగదును ఏసీబీ గుర్తించింది.

ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. బ్యాంక్ లాకర్లు (Bank Lockers), స్థిరాస్తి పత్రాలను లోతుగా పరిశీలిస్తున్నారు. అధికారులు ఇంకా నిందితుడికి సంబంధించిన అదనపు వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడు యదగిరి రావును హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో (Special ACB Court) హాజరుపరిచి రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం (Bribe) డిమాండ్ చేస్తే వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు ఏసీబీ విజ్ఞప్తి చేసింది. దీనికోసం టోల్ ఫ్రీ నెంబర్ 1064 తో పాటు వాట్సాప్ నెంబర్ 9440446106 ను అందుబాటులోకి తెచ్చింది. సోషల్ మీడియా ద్వారా కూడా ఫిర్యాదులు చేయవచ్చని తెలిపింది.