మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం “విశ్వంభర” (Vishwambhara). అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్ట్, ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో బిజీగా ఉంది. గతంలో విడుదలైన టీజర్‌పై విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పరంగా కొన్ని మిశ్రమ స్పందనలు రావడంతో, మేకర్స్ ఇప్పుడు ప్రతి ఫ్రేమ్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై తాజాగా ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం, తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా ‘విశ్వంభర’ విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది. కేవలం ప్రకటనతో సరిపెట్టకుండా, అద్భుతమైన విజువల్స్, మెగాస్టార్ ఎలివేషన్లతో కూడిన ఒక ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసి, ఆ వీడియో ద్వారానే రిలీజ్ డేట్‌ను వెల్లడించాలని దర్శకుడు వశిష్ట ప్లాన్ చేస్తున్నారు. అంతే కాదు గ్రాఫిక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, టీజర్‌కు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ రిపీట్ కాకుండా హాలీవుడ్ స్థాయి అవుట్‌పుట్ వచ్చేలా యూవీ క్రియేషన్స్ భారీగా ఖర్చు చేస్తోంది. సృష్టి, స్థితి, లయ అనే అంశాల చుట్టూ అల్లిన ఈ కథలో చిరంజీవి విశ్వరూపం కనిపించబోతోందని సమాచారం.
ఈ సినిమాలో ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ తరహా సోషియో ఫాంటసీ వినోదంతో పాటు, ‘హిట్లర్’ చిత్రంలోని సిస్టర్ సెంటిమెంట్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో మ్యూజికల్ గా కూడా సినిమా రేంజ్ మరో స్థాయిలో ఉండబోతోంది. ఉగాది గ్లింప్స్ తర్వాత ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవ్వడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.