మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం పెద్ద స్కామ్ అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వమే జీతం చెల్లిస్తుందని.. కానీ నిర్వహణ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంటుందన్నారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేరా? అని ప్రభుత్వాన్ని జగన్ప్రశ్నించారు. ఖర్చు చేయకపోతే మెడికల్ కాలేజీలను అలానే వదిలేయండని.. తాము అధికారంలోకి వచ్చాక పూర్తిచేస్తామన్నారు. వైసీపీకి ఎక్కడ క్రెడిట్ వస్తుందేమోనని పేదలకు నష్టం చేయడం సరికాదన్నారు. సీఎం చంద్రబాబు కొత్త స్కామ్‌లు సృష్టిస్తున్నారని, ఒక్కరోజు యోగా కార్యక్రమానికి రూ.300 కోట్లు ఖర్చు చేశారని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను లోక్‌భవన్‌లో గవర్నర్‌కు వైఎస్ జగన్ అందజేశారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ… ‘పీపీపీకి వ్యతిరేకంగా కోటి నాలుగు లక్షల మంది సంతకాలు చేశారు. గవర్నర్‌ను కలిసి సీఎం చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని వివరించాం. ప్రజల ఆకాంక్షను గవర్నర్‌కి తెలియజేశాం. గవర్నర్ మంచి మనసుతో అన్ని విన్నారు. దేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి ఉద్యమం జరగలేదు. గ్రామ స్థాయి నుంచి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిరసన తెలియజేశారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి.. పీపీపీ వెనక్కి తీసుకోవాలి. సామాన్యులు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. ప్రైవేటు చేతుల్లోకి హాస్పిటల్స్ మొత్తం వెళ్లిపోతే నియంత్రణ ఉండదు.. ప్రజలు దోపిడీకి గురవుతారు. ప్రభుత్వ హాస్పిటల్స్ ఉంటే ప్రైవేటు హాస్పిటల్స్ కంట్రోల్లో ఉంటాయి. ప్రభుత్వం నడపడం వల్ల వైద్యం, విద్య తక్కువ రేట్లకి అందుబాటులోకి వస్తుంది. అంతా ప్రైవేటు అయితే ఇంకా సామాన్య పిల్లలు వైద్య విద్య చదవగలరా?’ అని ప్రశ్నించారు.
Also Read: CM Chandrababu: ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఆరుగురు కేంద్ర మంత్రులతో భేటీ!
‘కాలేజీలు ప్రయివేటుకు ఇవ్వడం పెద్ద స్కామ్, జీతాలు ఇవ్వడం అతిపెద్ద స్కామ్. సీఎం చంద్రబాబు స్కామ్‌లలో కొత్త స్కామ్‌లు సృష్టిస్తున్నాడు. దేశ చరిత్రలో ఇలాంటి స్కామ్ ఎక్కడా చూసి ఉండరు. వెయ్యి కోట్లు ఏడాదికి పెట్టలేరా?, పెట్టకపోతే అలా వదిలేయండి. మేము అధికారంలోకి వచ్చాక పూర్తి చేస్తాం. మాకు క్రెడిట్ వస్తుందేమో అని పేదలకు నష్టం చెయ్యడం సరికాదు. 17 మెడికల్ కాలేజీలు లక్ష కోట్ల ఆస్తి.. కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపుతాయి. రేపు కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేస్తాం. చంద్రబాబు చర్మం మందం.. ఇంత చేసినా ఆయనలో మార్పు రాకపోవచ్చు. హెరిటేజ్ కి గవర్నమెంట్ పేరు పెడితే ప్రభుత్వానిది అయిపోతుందా?. రుషికొండ విశాఖకు ఆణిముత్యంలా ఉంది. రూ.240 కోట్లు ఖర్చు చేసి బ్రహ్మాండమైన భవనాలు కట్టాం. ఎవరైనా వీఐపీలు వస్తే అందులో ఉండవచ్చు. విశాఖ మొత్తానికి తలమానికంగా ఉంది.. టూరిస్ట్ ప్లేస్ లా ఉంది. యోగా డేకి రూ.330 కోట్లు వృధా చేశారు’ అని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు.
