ఇటీవల దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. ఇళ్లలోకి చొరబడి భారీగా దోచుకెళ్తున్నారు. మాటలతో మభ్యపెట్టి మెడలో బంగారు గొలుసులను కూడా మాయం చేస్తున్నారు కేటుగాళ్లు. తాజాగా హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోయారు. ఫిలీం నగర్ లో భారీ చోరికి పాల్పడ్డారు. ఫిలిమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్ పేట్ డైమండ్ హిల్స్ లో ఓ ఇంట్లో భారీ చోరీ చోటుచేసుకుంది. ఇంట్లో బీరువా తాళాలు పగలగొట్టి 34 తులాల బంగారు ఆభరణాలు, 4.5 లక్షల నగదు, 550 కేనేడియన్ డాలర్స్ అపహరణకు గురయ్యాయి.
Also Read:Israel-Gaza: గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు.. 44 మంది మృతి
చోరీ జరిగిన ఇంటిని మొజాహిత్ అనే వ్యక్తికి సంబంధించినదిగా పోలీసులు తెలిపారు. మొజాహిత్ కుటుంబం రంజాన్ మాసం కావడంతో ఉదయం బంధువుల ఇంటికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. గత కొన్ని రోజుల క్రిందటనే మొజాహిత్ ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. చోరీకి పాల్పడడమే కాకుండా.. సీసీ కెమెరాల్లో తమ వీడియోస్ కనిపించకుండా సీసీ కెమెరా హార్డ్ డిస్క్ తో సహా ఎత్తుకెళ్లిపోయారు దొంగలు. మోజాహిత్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.