Cyclone Dana: బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. రేపు దానా తుఫాన్ తీరం దాటనుంది. ఏపీ సహా మూడు రాష్ట్రాలపై తుఫాన్ ఎఫెక్ట్ ఉండబోతోంది. దానా తుఫాన్ ఒడిశాలోని పూరీ- పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలండ్ మధ్య తీరం దాటనుంది. ఆ సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని… ఈదురు గాలుల తీవ్రత 140 నుంచి 160 కిలోమీటర్ల వరకూ పెరిగడానికీ అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇక, దీని ప్రభావం వల్ల ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల్లో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. తీరానికి సమీపించే కొద్దీ మూడు రాష్ట్రాలపై దానా తుఫాన్ ప్రభావం ఉధృతంగా ఉంటుంది. నేటి నుంచి 25వ తేదీ వరకు ఉత్తరాంధ్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది ఐఎండీ.
Read Also: YASH : KGF – 3 ఫిక్స్.. యశ్ కీలక వ్యాఖ్యలు
ఇక, ఒడిశాలోని తీర ప్రాంత జిల్లాలకు ఎల్లో వార్నింగ్ జారీ చేశారు అధికారులు.. భద్రక్, బాలాసోర్, జైపూర్, కేంద్రపారా, కటక్, జగత్‌సింగ్‌పూర్ రాయగడ, గజపతి, గంజాం, కొంధమాల్, నయాగఢ్, ఖుర్దా, పూరీ జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. తీర ప్రాంతవాసులను ఖాళీ చేయిస్తోంది అక్కడి ప్రభుత్వం. పశ్చిమ బెంగాల్‌లో ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని కోల్‌కత, హౌరా, హుగ్లీ, ఉత్తర 24 పరగణా, పురూలియా, బాంకుర జిల్లాల్లో మూడురోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.
Read Also: IND vs NZ 2nd Test: దాచడానికేమీ లేదు.. రాహుల్-సర్ఫరాజ్ మధ్య పోటీ ఉంది: కోచ్
మరోవైపు.. తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ అనకాపల్లి జిల్లాపైనా ప్రభావం చూపనుండడంతో కలెక్టర్ విజయకృష్ణన్ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తుఫాన్ ప్రభావంతో రేపటి నుంచి 26 వతేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకావం వుందని సమాచారం. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు కలెక్టర్. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు. ఇక, దానా తుఫాన్ ఎఫెక్ట్‌తో మూడు రోజుల పాటు పలు రైళ్లను రద్దు చేశారు అధికారులు.. ఈ రోజు, రేపు, ఎల్లుండి మొత్తంగా 41 రైళ్లు రద్దు చేశారు.. సికింద్రాబాద్-భువనేశ్వర్, కన్యాకుమారి-దిబ్రూగఢ్, చెన్నై సెంట్రల్-షాలిమార్, ముంబై-భువనేశ్వర్ కోణార్క్, హైదరాబాద్-హౌరా ఈస్ట్ కోస్ట్, బెంగళూరు-హౌరా తదితర రైళ్లు రద్దు చేసినవాటిలో ఉన్నాయి.. ఈ రోజు సికింద్రాబాద్ – భువనేశ్వర్, హైదారాబాద్ – హౌరా, సికింద్రాబాద్ – హౌరా, సికింద్రాబాద్ – మల్దాటౌన్ రైళ్లను రద్దు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే.. ఇక, రేపు హౌరా – సికింద్రాబాద్, షాలిమార్ – హైదారాబాద్, సిల్చార్ – సికింద్రాబాద్ రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించింది. మరోవైపు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైల్వేశాఖ అప్రమత్తం అయింది. ముందు జాగ్రత్తగా పలు రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు ప్రయాణికులను అలర్ట్ జారీ చేసింది. ఈనెల 23, 24, 25 తేదీల్లో మొత్తంగా 198 రైలు సర్వీసులను ఈస్ట్ కోస్ట్ రైల్వే క్యాన్సిల్ చేసింది.