NTV Telugu Site icon

Manipur Violence: మణిపూర్ హింసాకాండలో చనిపోయిన వారికి రూ.10లక్షలు.. ఇంటికో ఉద్యోగం

Manipur Govt

Manipur Govt

Manipur Violence: మే 3న మణిపూర్‌లో చెలరేగిన హింసాకాండ ఇంకా చల్లారలేదు. దాదాపు 80 మంది చనిపోయారు. వందలాది మంది గాయపడ్డారు. మరోవైపు ఈ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి. దీంతో పాటు మృతుల కుటుంబంలోని ఒక్కరికీ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. పరిహారం మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి భరిస్తాయి. ఈ మేరకు మంగళవారం అధికారులు సమాచారం అందించారు. సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ మధ్య జరిగిన సమావేశం తరువాత పరిహారం ప్రకటించారు. అలాగే వంటగ్యాస్, పెట్రోలు, బియ్యం, ఆహారోత్పత్తులు వంటి వాటిని తక్కువ ధరలకు ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి షాతో పాటు హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా, ఐబీ డైరెక్టర్ తపన్ కుమార్ డేకా కూడా పాల్గొన్నారు.

Read Also:Karumuri Nageswara Rao: చంద్రబాబు మేనిఫెస్టో టిష్యూ పేపర్ లాంటిది.. తుడుచుకోవటానికి తప్ప దేనికీ పనికిరాదు

మణిపూర్‌లో శాంతి నెలకొల్పడానికి కట్టుబడి ఉన్నామని అమిత్ షా అన్నారు. అదే సమయంలో మంగళవారం మణిపూర్‌లో పలువురు మహిళా నేతలతో కేంద్ర హోంమంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశానంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనేందుకు కలిసికట్టుగా కృషి చేస్తున్నామన్నారు. మణిపూర్‌లో పౌర సమాజ సంస్థల ప్రతినిధి బృందాన్ని కూడా అమిత్ షా కలిశారని హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. మరోవైపు, పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో మణిపూర్ హింసను ప్రస్తావిస్తూ, మణిపూర్‌లో పరిస్థితిని మెరుగుపరచడానికి సమయం పడుతుందని సిడిఎస్ అనిల్ చౌహాన్ అన్నారు. మణిపూర్‌లో ఈ నెల 3న మెయిటీ కమ్యూనిటీ ప్రజలను ఎస్టీలో చేర్చడానికి ‘గిరిజన ఏక్తా మార్చ్’ చేపట్టారు. ఈ సందర్భంగా హింస చెలరేగింది. రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండ దృష్ట్యా 10,000 మందికి పైగా బలగాలను మోహరించారు.

Read Also:Jharkhand: పెళ్లయిన 15రోజులకే అల్లుడిని దారుణంగా చంపిన తండ్రికొడుకులు