NTV Telugu Site icon

No Work No Pay: ‘నో వర్క్ నో పే’.. ప్రభుత్వ ఉద్యోగులకు మణిపూర్‌ సర్కారు కొత్త నిబంధన!

Manipur

Manipur

Manipur: విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగుల జీతంలో కోత విధించాలని మణిపుర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విధులకు గైర్హాజరవుతున్న ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను సిద్ధం చేయాలని రాష్ట్ర పరిపాలన శాఖకు ఉత్తర్వులు అందాయి. అనుమతి లేకుండా సెలవు తీసుకొని విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు విధులకు గైర్హాజరైన ఉద్యోగుల వివరాలు సిద్ధం చేయాలని జీఏడీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందినట్లు ఆ శాఖ కార్యదర్శి మిఖాయేల్‌ అచోమ్‌ తెలిపారు. రాష్ట్ర పరిపాలనా శాఖ నుంచి జీతం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగులు.. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే.. వారి జీతంలో కోత విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పరిపాలన శాఖ కార్యదర్శి మిఖాయేల్‌ అచోమ్‌ వెల్లడించారు. జూన్‌ 12న సీఎం బీరేన్‌ సింగ్ అధ్యక్షన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర జీఏడీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయన్నారు.

Also Read: Integrated BEd: 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సుకు జాతీయ ఎంట్రన్స్

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా విధులకు హాజరుకాని, ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా సిద్ధం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ శాఖల్లో సుమారు లక్ష మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. గత నెల రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న హింస కారణంగా కొందరు ఉద్యోగులు విధులకు హాజరుకాలేకపోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయం చర్చనీయాంశమైంది. అయితే, ఈ నిబంధన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటుందనేది వెల్లడించలేదు.

మణిపూర్ ప్రభుత్వంలో దాదాపు లక్ష మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో చాలామంది విధులకు హాజరుకాలేదు. అధికారుల ప్రకారం, మణిపూర్‌లో నిరాశ్రయులైన 65,000 మందిలో చాలా మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. సహాయక శిబిరాల్లో ఆశ్రయం పొందారు. మణిపూర్‌లో జరిగిన జాతి హింసలో 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 400 మందికి పైగా గాయపడ్డారు. ఈ హింస కారణంగా పెద్ద ఎత్తున ఇళ్లు, ఆస్తులు ధ్వంసం అయ్యాయి. తమ ఉద్యోగులకు “నో వర్క్, నో పే” నిబంధనను తీసుకురావాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కుకీ తెగల అత్యున్నత సంస్థ కుకి ఇన్పి మణిపూర్ (KIM) తీవ్రంగా వ్యతిరేకించింది. మణిపూర్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రాణాలను, ముఖ్యంగా ఇంఫాల్ లోయ నుంచి పారిపోయిన వారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తోందని KIM జనరల్ సెక్రటరీ ఖైఖోహాహు గాంగ్టే అన్నారు.

మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై రెండు రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం, మణిపూర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌ ప్రత్యేకంగా అమిత్‌ షాతో భేటీ అయి రాష్ట్రంలోని పరిస్థితులపై నివేదిక సమర్పించారు. మణిపూర్‌లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని అమిత్‌ షా హామీ ఇచ్చారని భేటీ అనంతరం సీఎం బీరేన్‌ సింగ్‌ తెలిపారు. మరోవైపు, రాష్ట్రంలోని పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారిని మంగళవారం సీఎం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు.

Show comments