తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా మాణిక్ రావు థాక్రేను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు కేసీ వేణుగోపాల్. రాష్ట్ర ఇంచార్జ్ గా ఉన్న మాణిక్కం ఠాకూర్ కు గోవా ఇంచార్జ్ గా బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. మహారాష్ట్రకు చెందిన మాణిక్ రావు థాక్రే 2008 నుంచి 2015 వరకు మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు గా పనిచేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో 1985 నుంచి 2004 మధ్య నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 నుంచి 2018 మధ్య ఎమ్మెల్సీగా పనిచేశారు. శరద్ పవార్, విలాస్ రావు దేశ్ ముఖ్, సుశీల్ కుమార్ షిండేల మంత్రి వర్గాల్లో మూడు సార్లు వివిధ శాఖల మంత్రిగా వ్యవహించారు మాణిక్ రావు థాక్రే. పరిపాలన అనుభవం, పార్టీ సీనియర్ నేతగా అనుభవం ఉండడంతో కాంగ్రెస్ అధిష్టానం మాణిక్ రావు నియమించింది.
Also Read : Justice S Abdul Nazeer: సంస్కృత శ్లోకంతో వీడ్కోలు చెప్పిన జస్టిస్ అబ్దుల్ నజీర్.. అయోధ్య వివాదంపై తీర్పు
ఇదిలా ఉంటే.. ఇటీవల కాంగ్రెస్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు అధిష్టానం దిగ్విజయ్‌సింగ్‌ను రంగంలోకి దింపింది. అయితే.. కమిటీల్లో తమకు సరైన ప్రాధాన్యత లభించలేదని బహిరంగంగానే తమ అసంతృప్తి గళాలు వినిపించిన, అసంతృప్తితో ఉన్న నేతలతో దిగ్విజయ్ సింగ్ ఫోన్లో చర్చించారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ సింగ్‌తో టీకాంగ్రెస్ సీనియర్ నేతలు.. పార్టీలో అలజడికి కారణం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇన్‌చార్జ్ గా ఉన్న మాణికం ఠాగూర్ అని ఆరోపించినట్లు, చాలా మంది సీనియర్ నేతలు మాణికం ఠాగూర్ వ్యవహారశైలిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మాణిక్కం ఠాగూర్ వ్యవహార శైలి వల్లే చాలా సమస్యలు వస్తున్నాయని, వెంటనే ఠాగూర్‌ను ఆ పదవి నుంచి తప్పించాలని కోరినట్లు సమాచారం. అయితే.. అనూహ్యంగా నేడు టీకాంగ్రెస్ ఇంచార్జ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు మాణిక్కం ఠాగూర్ ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారల ఇంచార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ పంపారు. అదే సమయంలో తెలంగాణ వాట్సప్ గ్రూప్ నుంచి మాణిక్కం ఠాగూర్ లెఫ్ట్ అయ్యారు.
