గత ఐదు సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీనిర్వీర్యమైందని.. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన రెండు నెలలో ఆర్టీసీని గాడిలో పెట్టినట్లు రోడ్డు రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నిర్వీర్యం అయిన సంస్థలను గాడిలో పెట్టడానికి ఇది ఒక సువర్ణ అవకాశమన్నారు. కడప నగరంలోని ఆర్టీసీ డిపోలో 17 నూతన బస్సులను రోడ్డు రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. “పింఛన్లు, రేషన్ పేదలకు ఎంత అవసరమో ఆర్టీసీ ప్రయాణం కూడా అంత ఆవసరం. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాం. మహిళల ఉచిత ఆర్టీసీ ప్రయాణం కోసం 1400 బస్సులను ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతానికి 400 బస్సులు సిద్ధంగా ఉన్నాయి.” అని తెలిపారు.
READ MORE: YS Jagan: ఏపీలో ముఠాల పాలన కనిపిస్తుంది..
మరో వెయ్యి బస్సులను తీసుకొస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ “రాబోయే రోజుల్లో ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడం జరుగుతుంది. రాబోయే ఐదు సంవత్సరాల్లో 3000 నుంచి 5000 బస్సులను గ్రామాలకు, పట్టణాల్లోకి పోయే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి కావలసిన సంక్షేమ పథకాలను పూర్తిగా అందించేందుకు కృషి చేస్తాం. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఇంత భారీ మెజార్టీ రావడానికి కారణమైన మహిళలకు త్వరలో రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం.” అని చెప్పారు.