కర్నూలు రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో తలసేమియా, కాన్సర్ వంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న చిన్నారుల కోసం ప్రత్యేక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ హీరో మంచు మనోజ్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా రక్తదానం చేయగా, మోక్షజ్ఞ అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి రక్తదానంలో పాల్గొన్నారు. రక్తదాన శిబిరం అనంతరం మాట్లాడిన మంచు మనోజ్, సమాజంలో డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాల పై కఠిన వ్యాఖ్యలు చేశారు. “టెర్రరిజం ఒక వైపే రావడం లేదు. డ్రగ్స్ వాడితే టెర్రర్‌కు మద్దతు ఇచ్చినట్టే. డ్రగ్స్‌కు ఖర్చు చేసే డబ్బు చివరకు టెర్రరిస్టు ఆర్గనైజేషన్లకు చేరుతుంది” అని స్పష్టం చేశారు. యూత్ తప్పకుండా అవగాహన పెంపొందించుకోవాలని, అందరూ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా గళం విప్పాలని సూచించారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తం, కాన్సర్‌తో బాధపడుతున్న చిన్నారులకు ఎంతో ఉపయోగపడనుందని రెడ్‌క్రాస్ ప్రతినిధులు తెలిపారు.