Nuzvid IIIT: విద్యను ముగించుకొని ఇంటికి వెళ్ళబోతున్న విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీ అధికారులు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బకాయి ఉన్న ఫీజులను చెల్లిస్తేనే ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని చెప్పడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆందోళనపై ట్రిపుల్ ఐటీ యాజమాన్యం స్పందించింది. విద్యా్ర్థుల సమస్యలను తాము అర్థం చేసుకుంటామని ట్రిపుల్ ఐటీ పరిపాలన అధికారి ప్రదీప్ తెలిపారు. ఫీజు బకాయిల చెల్లింపుకు మరో నెల రోజుల సమయం ఇచ్చామన్నారు. సర్టిఫికెట్లు తీసుకోవటానికి ఎటువంటి ఇబ్బంది లేదని.. విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Read Also: Nuzvid IIIT: విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీ అధికారులు షాక్!
జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన ప్రభుత్వం నుంచి ఎంత పడితే అదే చెల్లించాలని కోరామన్నారు. ప్రభుత్వం నుంచి పెండింగ్ ఉన్న వాటి సంగతి తాము అడగటం లేదన్నారు. ఫీజు బకాయిలు చెల్లించాలని నెలరోజుల క్రితమే విద్యార్థులకు చెప్పామని.. వారం రోజుల క్రితం సర్క్యులర్ పంపామన్నారు. కొంతమంది విద్యార్థులు బకాయి చెల్లిస్తున్నారని.. గత రెండు రోజుల నుంచి కొంత మంది విద్యార్థులు సమయం కావాలని రిక్వెస్ట్ చేశారని ఆయన తెలిపారు. క్యాంపస్‌లో ఎటువంటి ఆందోళనలు జరగలేదన్నారు.