Malkajgiri: మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్న కూకట్‌పల్లి నియోజకవర్గ సీపీఎం, సీపీఎం, ఎంఐఎం పార్టీల నాయకులతో కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో బాలనగర్ పార్టీ కార్యాలయంలో సంఘీభావ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరి వర్ధన్ రెడ్డి, మల్కాజ్‌గిరి పార్లమెంటు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ కో-కన్వీనర్ వినోద్ రెడ్డి, కూకట్‌పల్లి కో ఆర్డినేటర్ కోటిమరెడ్డి వినయ్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం పాల్గొన్నారు. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన సీపీఎం, సీపీఎం, ఎంఐఎంనాయకులకు, పెన్షనర్స్ సంక్షేమ సంఘ సభ్యులకు వారు ధన్యవాదాలు తెలిపారు.
నియోజకవర్గంలోని అన్ని వర్గాల మద్దతుతో మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని తిరిగి కైవసం చేసుకుంటామని సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. చేయూతనందిస్తున్న కమ్యూనిస్టు సోదరులకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, ఇండియా కూటమే దేశంలో అధికారం చేపట్టబోతుందని ఆయన అన్నారు. ఈ నాలుగు రోజులు పకడ్బందీగా, ప్రణాళికతో ఉమ్మడిగా ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని నాయకులను కోరారు. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కనీసం 14 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపించి ఇండియా కూటమి అధికారంలోకి రావడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సత్యం, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు వెంకట రెడ్డి, ఎంఐఎం నేత శంకర్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఏ, బీ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, వేణు, సమన్వయ కమిటీ సభ్యులు రఘు, తదితరులు పాల్గొన్నారు.