ఫిలిప్పీన్స్లో 6.9 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భూకంపం దేశంలోని అనేక ప్రాంతాలను అతలాకుతలం చేసింది. ప్రజలు భయాందోళనలకు గురయ్యారని, ఇళ్లు, కార్యాలయాల నుండి బయటకు పరుగులు తీశారని అధికారి తెలిపారు. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా అనేక భవనాలు కూలిపోయి కనీసం 20 మంది మరణించారని ఒక సీనియర్ అధికారి తెలిపారు. చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. భూకంప కేంద్రం, ప్రభావిత ప్రాంతాల వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే ప్రాథమిక నివేదికలు గణనీయమైన ఆస్తి నష్టం, ప్రాణనష్టాన్ని నిర్ధారించాయి.
Also Read:OG : రేపు పవన్’తో ఓజీ సక్సెస్ సెలబ్రేషన్స్
ఫిలిప్పీన్స్ విపత్తు నిర్వహణ అధికారులు వెంటనే సహాయ చర్యలను ప్రారంభించారు. శిథిలాలలో చిక్కుకున్న వారిని రక్షించడానికి రెస్క్యూ బృందాలు కృషి చేస్తున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్, కమ్యూనికేషన్ సేవలు నిలిచిపోయాయి. ఫిలిప్పీన్స్ పసిఫిక్ మహాసముద్రంలోని “రింగ్ ఆఫ్ ఫైర్” పై ఉన్నందున అది ఎల్లప్పుడూ భూకంపాల ప్రమాదాలకు గురవుతుంటుంది. ఇక్కడ టెక్టోనిక్ ప్లేట్ కదలికలు తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలకు కారణమవుతాయి.