NTV Telugu Site icon

Hyderabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తప్పిన భారీ ప్రమాదం.. అత్యవసరంగా కార్గో విమానం ల్యాండింగ్

Airport

Airport

Hyderabad Airport: హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేడు ఉదయం భారీ ప్రమాదం తప్పింది. చెన్నై నుండి హైదరాబాద్‌కు వస్తున్న బ్లూడార్ట్ కార్గో విమానానికి ల్యాండింగ్ గేర్ సమస్య తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరాడు. వెంటనే ఎయిర్‌పోర్ట్ అధికారులు స్పందించి ఇతర అంతర్జాతీయ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ను నిలిపివేశారు. ఎటువంటి అవాంతరాలు లేకుండా, పైలట్ విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై ల్యాండ్ చేయగలిగాడు. సమస్య తలెత్తిన సమయంలో కార్గో విమానంలో మొత్తం 6 మంది సిబ్బంది ఉన్నారు. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన విమానాశ్రయంలో కాసేపు భయాందోళన కలిగించింది. విమానం ల్యాండింగ్ గేర్ సమస్యను సాంకేతిక నిపుణులు పరిశీలిస్తున్నారు.

Read Also: Punjagutta Murder Case: ప్రతిరోజు ‘యూ బెగ్గర్‌’ అంటూ అవమానించేవాడు

ఇక మరో ఘటనలో, హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న అమీర్ అహ్మద్ అనే ప్రయాణికుడి వద్ద అనుమానాస్పద రీతిలో 22.75 లక్షల విలువైన విదేశీ కరెన్సీ ఉన్నట్లు గుర్తించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అనుమతులు లేకుండా విదేశీ కరెన్సీ తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రయాణికుడు ఈ డబ్బును ఎక్కడి నుంచి సంపాదించాడు? దాన్ని ఎక్కడ వినియోగించాల్సి ఉంది? అనే అంశాలపై విచారణ చేపట్టారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇలా అనేక రకాల అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్ అధికారుల అప్రమత్తత వల్ల, ఈసారి పెద్ద ప్రమాదం తప్పినంత మాత్రాన భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉంది.