ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ ‘మహీంద్రా అండ్ మహీంద్రా’కు చెందిన మూడు వాహనాలు భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించాయి. మహీంద్రా థార్ రాక్స్, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ, మహీంద్రా ఎక్స్‌యూవీ 400లు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా ప్రస్తుతం వాల్యూమ్ పరంగా భారతదేశంలో అతిపెద్ద ఎస్‌యూవీ తయారీదారుగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో ఎక్స్‌యూవీ 700, థార్‌లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి.
భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ కింద పెద్దలు, పిల్లల భద్రతకు సంబంధించి రేటింగ్‌ను ఇస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో మహీంద్రాకు చెందిన థార్ రాక్స్, ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ, ఎక్స్‌యూవీ 400 వాహనాలు చోటు దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని భారత్ ఎన్‌క్యాప్ తన ఎక్స్ వేదికగా వెల్లడించింది. మహీంద్రా నుంచి 5 స్టార్ రేటింగ్ సాధించిన తొలి విద్యుత్ వాహనం ఎక్స్‌యూవీ 400. పెద్దల భద్రతకు సంబంధించి 32 పాయింట్లకు గానూ 30.38 పాయింట్లు.. చిన్నారుల భద్రత విషయంలో 49 పాయింట్లకు గానూ 43 పాయింట్లు స్కోర్ చేసింది.
థార్ రాక్స్ పెద్దల భద్రతకు సంబంధించి 31.09 పాయింట్లు, చిన్నారుల భద్రత విషయంలో 45 పాయింట్లు స్కోర్ చేసింది. పెద్దల, చిన్నారుల భద్రతకు సంబంధించి 5 స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ కూడా పెద్దలకు, చిన్నారుల భద్రతకు సంబంధించి 5 స్టార్ పొందింది. పెద్దల భద్రతకు సంబంధించి 29.36 పాయింట్లు.. చిన్నారుల భద్రత విషయంలో 43 పాయింట్లు స్కోర్ చేసింది. ఇక టాటా మోటార్స్‌కు చెందిన టాటా నెక్సాన్, టాటా కర్వ్ కూడా ఇప్పటికే ఈ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించిన విషయం తెలిసిందే.