TPCC Chief : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమయ్యారు. టీపీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్‌ను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్‌కు పగ్గాలు అప్పగిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. కొత్త పీసీసీ చీఫ్ నియామక ఆదేశాలను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా మహేష్ కుమార్ గౌడ్ పని చేస్తున్నారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా పని చేసిన అనుభవం ఉంది. 2023లో పీసీసీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్‌ఎస్‌యూఐ నుంచి పార్టీ ఆర్గనైజేషన్‌లో మహేష్ కుమార్ గౌడ్ పని చేశారు.
Read Also: Drunk Man Dial 100: ఫుల్లుగా తాగి డయల్ 100కి ఫోన్ చేస్తున్న వ్యక్తికి జైలు శిక్ష
టీపీసీసీ పదవి కోసం పలువురు పోటీ పడగా.. మహేష్‌కుమార్ గౌడ్‌ను పీసీసీ పదవి వరించింది. పీసీసీ కోసం ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ గౌడ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లతో పాటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పోటీ పడినప్పటికీ మహేష్‌కుమార్ గౌడ్‌కు అధిష్ఠానం పగ్గాలను అప్పగించింది. పీసీసీ చీఫ్‌గా జులై 7న రేవంత్ పదవీకాలం పూర్తయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. బీసీ నేతకు పార్టీ అధ్యక్షుడి పదవీ కట్టబెట్టడంతో బీసీ సంఘాలు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రేపు హైదరాబాద్‌కు రానున్నారు. మహేష్‌కుమార్ గౌడ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా ఆయనకు ఫోన్ చేసి అభినందించడంతో పాటు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని.. అందరినీ కలుపుకుని పని చేయాలని సూచించారు. నూతన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పార్టీని నమ్ముకుని ఉన్న వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని అనడానికి తానే నిదర్శనమన్నారు. ఎన్‌ఎస్‌యూఐ నుంచి పార్టీ కోసం తాను పని చేశానన్నారు. పార్టీ కోసం పని చేసిన అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.