NTV Telugu Site icon

Maharashtra: ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలపై తీవ్రంగా స్పందించిన మహారాష్ట్ర సర్కారు..

Maharashtra

Maharashtra

Maharashtra: మహారాష్ట్రలోని పుణెలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) నిరసనకారులు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తున్న వీడియోలు ప్రస్తుతం  ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నినాదాల వీడియోపై మహారాష్ట్ర సర్కారు తీవ్రంగా స్పందించింది. “ఛత్రపతి శివాజీ మహారాజ్ భూమి”పై దేశ వ్యతిరేక నినాదాలను సహించబోమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అన్నారు. పీఎఫ్‌ఏ సంస్థపై ఈడీ, సీబీఐ దాడులను నిరసిస్తూ పీఎఫ్‌ఐ కార్యకర్తలు పుణెలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు “పాకిస్తాన్ జిందాబాద్” నినాదాలు చేశారు. ఈ ఘటనను సీఎం ఏక్‌నాథ్ షిండే ఖండించారు.

పుణెలో లేవనెత్తిన దేశవ్యతిరేక ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలను ఎంత ఖండించినా సరిపోదని… పోలీసులు తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటారన్నారు. వారికి ఆదేశాలను జారీ చేశామన్నారు. కానీ శివాజీ భూమిపై ఇలాంటి నినాదాలు చేస్తే సహించబోమని ఏక్‌నాథ్ షిండే ట్వీట్ చేశారు.

ఈ ఘటనలో ప్రమేయమున్న వారిని విడిచిపెట్టబోమని హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అన్నారు.నాగ్‌పూర్‌లో ఫడ్నవీస్ మాట్లాడుతూ, “మహారాష్ట్రలో లేదా భారతదేశంలో ఎవరైనా ‘పాకిస్తాన్ జిందాబాద్’ నినాదం చేస్తే, ఆ వ్యక్తిని వదిలిపెట్టరు. వారిపై చర్యలు తీసుకుంటారు, వారు ఎక్కడ ఉన్నా వారిని పట్టుకుని వారిపై చర్యలు తీసుకుంటాం.” అని ఫడ్నవీస్‌ అన్నారు.

Show comments