మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోడె మొక్కులు సమర్పించుకుని.. రాజన్న దర్శనం చేసుకుంటున్నారు. శివరాత్రి సందర్భంగా రాజన్న ఆలయాన్ని కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ సందర్శించారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు.
రాజన్న దర్శనం అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ… ‘మహా శివరాత్రి సందర్భంగా రాజన్నను దర్శనం చేసుకున్నా. దక్షిణ కాశీగా పిలువబడే రాజన్న ఆలయానికి వివిధ రాష్ట్రాలు, దేశాల నుండి కూడా భక్తులు వస్తున్నారు. రాజన్న ఆలయం మోస్ట్ పవర్ ఫుల్. దేశ ప్రధాని వేములవాడ రాజన్నను దర్శనం చేసుకున్నారు. అప్పటి నుండి దేశ వ్యాప్తంగా ఒక చర్చ కొనసాగుతుంది. ప్రధాని దర్శనం నుండి దేశ ప్రజలు కూడా వేములవాడకి వెళ్లానుకుంటున్నారు. మహా శివరాత్రి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఈఓ, సిబ్బంది, సేవ సంస్థలను అభినందిస్తున్నాను. ఇదే స్పూర్తితో చివరివరకు భక్తులకు సౌకర్యాలు కొనసాగించాలి’ అని సూచించారు.
వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. భక్తులు ప్రధాన ఆలయంలో గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది. దాంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అర్ధరాత్రి నుంచే క్యూలో 6 గంటల పాటు వేచి ఉన్నప్పటికీ దర్శనం కాలేదని, ప్రధాన ఆలయంలోకి అనుమతించలేదని కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజన్న దర్శనం కాకుండానే శిఖర దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. వీఐపీలు, అధికారులు అధిక సంఖ్యలో బంధువులకు నేరుగా దర్శనం చేయిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.