Bribery Head Master : ఉపాధ్యాయుడు సమాజంలో కీలకమైన వ్యక్తి. అతనో మార్గదర్శి. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి పిల్లలను జీవితంలో ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన గొప్ప దార్శికుడు. అలాంటి ఉపాధ్యాయుడు అవినీతికి పాల్పడితే అది సమాజానికి చేటు చేస్తుంది. కానీ కొందరు స్వార్థపూరితులైన ఉపాధ్యాయులు వారు చేస్తున్న వృత్తికి కలంకం తీసుకొస్తున్నారు. అలాంటి ఓ టీచరుకు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇది మధ్య ప్రదేశ్ లోని ఛతర్ పూర్లో జరిగిన ఘటన. గెస్ట్ టీచర్ పోస్టు కోసం రెండు వేల రూపాయలు లంచం డిమాండ్ చేసిన కేసులో హెచ్ఎంనకు ఛతర్‌పూర్‌లోని కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అవినీతి నిరోధక చట్టం కింద హెచ్ఎం చంద్రభాన్ సేన్‌ను దోషిగా తేల్చి ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి సుధాషు సిన్హా శనివారం నాడు రూ.30,000 జరిమానా విధించారని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కెకె గౌతమ్ తెలిపారు.
Read Also: Chandrababu Meeting: మరోసారి తొక్కిసలాట, ముగ్గురు మహిళలు దుర్మరణం.. ఘటనపై సీఎం దిగ్భ్రాంతి
జిల్లా కేంద్రానికి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సూరజ్‌పురకాలనీలోని ప్రభుత్వ స్కూల్ ఉంది. ఈ స్కూల్లో గెస్ట్ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉంది. ఈ ఉద్యోగానికి లక్ష్మీకాంత్ శర్మ అప్లై చేసుకున్నాడు. ఉద్యోగం కావాలంటే ఇన్‌ఛార్జ్ హెడ్‌మాస్టర్ చంద్రభాన్ సేన్ రూ.2,000 లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని శర్మ 2015 జనవరి 6న సాగర్ లోకాయుక్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రభాన్ సేన్ రెండు రోజుల తర్వాత అధికారులు వేసిన ఉచ్చులో చిక్కుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడటం సమాజాన్ని కుళ్లి పెడుతున్న అతిపెద్ద సమస్యగా న్యాయమూర్తి సిన్హా ఉత్తర్వుల్లో తెలిపారు. ఉపాధ్యాయుడు అవినీతికి పాల్పడితే అది సమాజానికి చేటు చేస్తుందని న్యాయవాది గౌతమ్ కోర్టుకు సమర్పించిన వాదనలో పేర్కొన్నారు.