SBI ATM Theft: అన్నమయ్య జిల్లా మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో అర్ధరాత్రి దొంగల ముఠా బీభత్సం సృష్టించింది. స్థానికంగా ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంను లక్ష్యంగా చేసుకున్న నలుగురు దుండగులు, ఏకంగా ఏటీఎం మిషన్‌నే బొలెరో వాహనంలో ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి వేళ బొలెరో వాహనంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కు చేరుకున్న దుండగులు ఏటీఎంను పెకలించేందుకు యత్నించారు.
ఆ విషయాన్నీ గమనించిన స్థానికులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా దొంగలు గన్ చూపించి బెదిరింపులకు దిగారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం దుండగులు ఏటీఎంను వాహనంలో ఎక్కించుకుని పరారయ్యారు. ఈ దొంగతనం మొత్తాన్ని ఎదురింటిలో ఉన్న స్థానికులు తమ ఫోన్లలో వీడియో తీశారు. ప్రస్తుతం ఈ ఎక్స్‌క్లూజివ్ విజువల్స్ పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారాయి.
ప్రారంభ దర్యాప్తులో దొంగలు బొలెరో వాహనం (AP28TB2281) లో ఏటీఎంను కొంతదూరం తరలించి, ఆపై కంటైనర్‌లోకి షిఫ్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ పోలీసు బలగాలను అలర్ట్ చేశారు. స్థానికులు తీసిన వీడియోలు, పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తూ నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

