లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బరిలోకి దిగుతున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత జాతీయ రాజకీయాల్లోకి ఆయన ఎంట్రీ ఇస్తున్నారు. శుక్రవారం విడుదల చేసిన జేడీఎస్ జాబితాలో కుమారస్వామి పేరు ప్రకటించారు. మాండ్య నుంచి కుమారస్వామి పోటీ చేస్తున్నారు. మాండ్యతో పాటు హాసన్, కోలార్ నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను వెల్లడించింది. హాసన్ నుంచి ప్రస్తుత ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, కోలార్ నియోజకవర్గం నుంచి ఎం. మల్లేష్ బాబు బరిలో నిలిచారు.
కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ మధ్య పొత్తు కుదిరింది. లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా జేడీఎస్ మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. దీంతో శుక్రవారం జేడీఎస్ అధిష్టానం అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. కుమారస్వామి ప్రస్తుతం చన్నపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి ఆయన పార్లమెంట్‌కు వెళ్లాలని భావించారు. దీంతో మాండ్య నుంచి కుమారస్వామి బరిలోకి దిగుతున్నారు.
ఇది కూడా చదవండి: Delta Air Lines: లో దుస్తులు వేసుకోలేదని దింపేస్తామన్నారు.. ఎయిర్‌లైన్స్‌పై మహిళ ఫైర్
ఇదిలా ఉంటే ఇటీవలే కుమారస్వామికి హార్ట్ సర్జరీ జరిగింది. ఆయన ఆరోగ్యం కుదిటపడడంతో లోక్‌సభ బరిలోకి దిగుతున్నారు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో చిక్కబల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక ప్రజ్వల్ రేవణ్ణ.. జేడీఎస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు, కుమారస్వామి మేనల్లుడు. వరుసగా రెండోసారి హాసన్ నుంచి బరిలోకి దిగుతున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. ఇక కోలార్ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ఎం. మల్లేష్ బాబు నిలిచారు. 2023 ఎన్నికల్లో బంగారుపేట (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎస్ఎన్ నారాయణస్వామి చేతిలో ఓడిపోయారు. కుల సమీకరణలతో పాటు పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లు జేడీఎస్ ఎమ్మెల్యే ఒకరు తెలిపారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: రేపు పిఠాపురానికి పవన్.. తొలి విడత ఎన్నికల ప్రచారం షెడ్యూల్ ఖరారు
2019 ఎన్నికల్లో కుమారస్వామి కుమారుడు నిఖిల్ మాండ్య లోక్‌సభ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి సుమలత అంబరీష్ విజయం సాధించారు. ఈసారి కుమారస్వామిని పోటీకి ఒప్పించడంలో బీజేపీ హైకమాండ్ కీలక పాత్ర పోషించిందని తెలుస్తోంది. ఇక బీజేపీ పోటీ చేస్తున్న 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక కాంగ్రెస్ 24 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను వెల్లడించింది. కర్ణాటకలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 26న దక్షిణ కర్ణాటక నియోజకవర్గాలకు మొదటి దశలో.. మే 7న ఉత్తర కర్ణాటకలో రెండో దశలో పోలింగ్ జరగనుంది. మొత్తం దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. చివరి విడత జూన్ 1న జరగనుంది. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి: Pakistan: పాకిస్తాన్‌కి చైనా షాక్.. ఆత్మాహుతి దాడితో కీలక ప్రాజెక్టులు నిలిపివేత..
