రెండు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్, ముస్లిం సంఘాలు కోరాయి. ఈ మేరకు సీఈసీకి కాంగ్రెస్ లేఖ రాసింది. ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభమవుతోంది. అయితే రెండో విడత ఏప్రిల్ 26న జరగనుంది. అయితే ఏప్రిల్ 26 శుక్రవారం వచ్చింది. ఇది ముస్లింలకు ప్రత్యేక మైన రోజు. ఆ రోజున ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటారు. ఈ కారణంగా తేదీలను మార్చాలని ఈసీని కేరళ కాంగ్రెస్ కోరింది.
ఏప్రిల్ 26 ముస్లింలకు ప్రత్యేక మైన రోజు అని.. ఓటు వేసేందుకు ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల తేదీని మార్చాలని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ MM హసన్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత VD సతీశన్.. ఎన్నికల సంఘాన్ని కోరారు. అలాగే కేరళతో పాటు తమిళనాడులో కూడా పోలింగ్ తేదీలను మార్చాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కోరింది.
ఏప్రిల్ 26న శుక్రవారం కావడంతో ముస్లిం ఓటర్లు ఇబ్బంది పడొచ్చని.. అలాగే ముస్లిం అధికారులు కూడా డ్యూటీలో పాల్గొనేందుకు ఇబ్బంది పడతారని ముస్లిం నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి కేరళ నేతలు, ముస్లిం నేతలు మెయిల్స్ పంపించారు. ఏప్రిల్ 26 తేదీని మార్చాలని కోరారు.
త్వరలో దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేఫన్ విడుదల చేసింది. ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ ప్రారంభమై.. జూన్ 1న ఏడో విడత పోలింగ్ ముగియనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే రెండో విడత మాత్రం శుక్రవారం రావడంతో ముస్లిం సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మరో తేదీకి మార్చాలని కోరుతున్నాయి. మరీ కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
