NTV Telugu Site icon

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు.. ఒకే నియోజకవర్గం నుంచి మాజీ భార్యభర్తలు పోటీ!

Sujata Mondal, Saumitra Khan

Sujata Mondal, Saumitra Khan

Ex Wife and Husband contesting in Bishnupur: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ వారంలోనే షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ తరుపున బెంగాల్ నుంచి పోటీ చేస్తున్న వారి పేర్లను తాజాగా సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. టీఎంసీ 42 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. కొన్నిస్థానాల్లో అభ్యర్థుల ఎంపిక చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లా బిష్ణుపుర్ నియోజకవర్గం నుంచి మాజీ భార్యభర్తలు పోటీ పడుతుండటం గమనార్హం.

బిష్ణుపూర్ నియోజకవర్గంలో టీఎంసీ తరఫున సుజాతా మండల్‌ పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో బీజేపీ నుంచి సౌమిత్రా ఖాన్‌ బరిలో ఉన్నారు. బిష్ణుపూర్ నియోజకవర్గంలో ఖాన్ సిట్టింగ్ ఎంపీ కూడా. అయితే సౌమిత్రా ఖాన్‌, సుజాతా మండల్‌ మాజీ భార్యభర్తలు కావడం ఇక్కడ విశేషం. ఇద్దరు ఒకే నియోజకవర్గంలో పోటీ చేస్తుండడం అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. వీరిద్దరూ 2021లో విడిపోయారు. 2021లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సుజాత, సౌమిత్రా విడిపోయారు.

Also Read: Rahul Dravid: భారత ఆటగాళ్లకు నా వీడియోలను చూపించా.. అందుకే సిక్సర్లు బాదుతున్నారు: ద్రవిడ్‌

2019లో లోక్‌సభ ఎన్నికల ముందు సౌమిత్రా ఖాన్‌ టీఎంసీని వీడి..బీజేపీలో చేరారు. అప్పుడు సుజాత మండల్‌ తన భర్త తరఫున భారీ ఎత్తున ప్రచారం చేశారు. అయితే 2021లో టీఎంసీ పార్టీలో సుజాత చేరారు. దాంతో అసహనానికి గురైన సౌమిత్రా.. కెమెరా ముందే ఆమెతో విడిపోతున్నట్టు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలలో వీరిద్దరు పోటీ పడనున్నారు. టీఎంసీ సుజాత మండల్‌ పేరు ప్రకటించగానే.. రాజకీయ అనుభవం ఉన్న ఎవరైనా బిష్ణుపూర్ నియోజకవర్గంలో నిలబడితే బాగుండేదని, మంచి పోటీ ఉండేదని సౌమిత్రా ఖాన్‌ విమర్శించారు. చూడాలి మరి మాజీ భార్యభర్తలలో గెలుపు ఎవరిదో.

Show comments