అవును.. శ్రీలంకలో అదే జరుగుతోంది. ఆనాడు రామాయణంలో హనుమంతుడు లంకను తగులబెట్టాడని అంటారు. చూసి రమ్మంటే కాల్చివచ్చాడంటారు. కానీ ఇప్పుడు లంకలో ఆ దేశ ప్రజలే హింసకు పాల్పడుతున్నారు. అధ్యక్షుడు, ప్రధాని, మంత్రులు.. ఎవరి ఇళ్ళను వదిలిపెట్టడం లేదు. ఎంపీలు, మాజీ మంత్రుల ఇళ్లకు ఆందోళనకారులు సాయంత్రం నిప్పు పెట్టారు. సోమవారం నాడు మధ్యాహ్నం ప్రధాని రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. రాజపక్సే రాజీనామా చేసిన తర్వాత కూడా ఆందోళనలు సద్దుమణగలేదు. కొలంబోలో శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న వారిపై ప్రభుత్వ మద్దతుదారులు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. శ్రీలంక మొత్తం ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.
ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాసపై ఆందోళకారులు దాడి చేశారు.సమగి జన బలవేగయ (ఎస్‌జేబీ) ఎంపీల బృందంతో గోటాగోగామాలోకి ప్రవేశించిన ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాసపై దాడి జరిగింది.గాలే ఫేస్ దగ్గర ఆందోళన చేస్తున్నవారికి మద్దతు తెలిపేందుకు వచ్చిన ప్రేమదాసపై నిరసనకారులు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. రాజపక్సే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వారికి, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళకారులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.