NTV Telugu Site icon

Liquor Allergy: మందు బాబులు అలర్ట్.. లిక్కర్‌ అలర్జీ ముప్పు.. హైదరాబాద్‌లో తొలి కేసు..

Liquor Allergy

Liquor Allergy

Liquor Allergy: సంతోషం వచ్చినా.. బాధ కలిగినా.. ప్రమోషన్‌ వచ్చినా.. డిమోషన్‌ వచ్చినా.. బంధువులు వచ్చినా.. ఫ్రెండ్స్‌ కలిసినా.. ఇలా ఏది జరిగినా.. వచ్చేది ఒక్కటే మాట.. అదే మందు వేద్దామా? అని అంతలా చాలా మంది లిక్కర్‌లో మునిగితేలుతున్నారు.. అయితే, మందు బాబులు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది.. ఇప్పటి వరకు లిక్కర్‌తో లివర్‌ చెడిపోతుందని మాత్రమే అనుకొనేవాళ్లు.. కానీ, ఇప్పుడో షాకింగ్ వ్యవహారం వెలుగు చూసింది.. హైదరాబాద్‌లో వెలుగు చూసిన అరుదైన కేసు.. మందు బాబులు ఒక్కసారి ఉలిక్కిపడేలా చేస్తోంది.. ఇది ఎందరిలో ఉంది.. ఎలా వస్తుంది.. ఎలాంటి రియాక్షన్‌ ఉంటుంది? ఎలా గుర్తించాలి? లాంటే అనేక సందేహాలను తెరపైకి తెచ్చింది..

Read Also: Sourav Ganguly: బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి భద్రత పెంపు!

మందు తాగేవారిలో ఎర్రటి దద్దుర్లతో ‘లిక్కర్‌ అలర్జీ’ అనే అరుదైన వ్యాధి సోకుతుందని చాలా మందికి ఇప్పటి వరకు తెలిసి ఉండదు.. కానీ, దాని గురించి తెలుసుకోవాల్సిన సమయం వచ్చేంది.. ఎందుకంటే మనదేశంలో లిక్కర్‌ అలర్జీని ఇటీవల తొలిసారి హైదరాబాద్‌లోనే గుర్తించారు. ఆగ్రా నుంచి వచ్చిన జాన్‌ అనే 36 ఏళ్ల యువకుడికి ఈ వ్యాధిని గుర్తించారు.. జాన్‌కు ఈ వ్యాధి సోకినట్టు హైదరాబాద్‌లోని అశ్విని అలర్జీ సెంటర్‌ వైద్యులు తేల్చారు.. ఇది చాలా అరుదైన వ్యాధి అని, మద్యం సేవించడం వల్ల కొంతమంది శరీరంలో అలర్జీకి సంబంధించిన మార్పులు కనిపిస్తాయంటున్నారు డాక్టర్‌ వ్యాకరణం నాగేశ్వర్‌.. అయితే, చాలా అరుదైన కేసు.. ప్రపంచంలోనే ఈ తరహా కేసులు వందకు మించి ఉండవని పేర్కొన్నారు.. జాన్‌ కొంతకాలం క్రితం ఓ విందులో పాల్గొన్నాడు.. అక్కడే మద్యం సేవించగానే, అతని ముఖం వేడిగా మారడంతోపాటు ఎర్రబడింది. చర్మంపై దురదలు రావడం, ఛాతీ పట్టేసినట్టుగా ఉండటంతో ఆస్పత్రిలో చేరాడు.. చికిత్స తర్వాత అతని ఆరోగ్యం మెరుగుపడింది.. కానీ, రెండు నెలల తర్వాత మరోసారి మద్యం సేవించడంతో మళ్లీ అదే పరిస్థితి వచ్చింది..

Read Also: NIA Raids: ఆరు రాష్ట్రాల్లోని 100 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు

తన శరీరంలో కలుగుతోన్న ఈ మార్పులపై చాలా మంది వైద్యులను సంప్రదించాడు జాన్.. ఎన్నో ఆస్పత్రులు తిరిగాడట.. చివరకు అశ్విని అలర్జీ సెంటర్‌కు వెళ్లాడు.. డాక్టర్‌ నాగేశ్వర్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం అతడిని పరీక్షించి అరుదైన ఆల్కహాల్‌ అలర్జీగా గుర్తించారు.. మద్యం తాగేటప్పుడు నూనెలో వేయించిన మసాలా పల్లీలు, బఠానీలు, చికెన్‌, మటన్‌ రోస్ట్‌ వంటి హై హిస్టమిన్‌ ఫుడ్‌ తినడం వల్ల భయంకరమైన అలర్జీకి దారితీస్తుందని తెలిపారు వైద్యులు.. దీనిపై నిర్లక్ష్యంగా ఉంటే.. ప్రాణానికి కూడా ప్రమాదం పొంచిఉందని హెచ్చరించారు.. మద్యం తాగినపుడు ఏదైనా అలర్జీ వచ్చిందంటే.. వారు మద్యపానానికి దూరంగా ఉండటమే ఉత్తమ మార్గమని వైద్యులు చెబుతున్నారు.