Lionel Messi: ఫిఫా వరల్డ్‌కప్ 2026లో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) మరోసారి తన మార్క్ ఆటను ఆడి చూపించాడు. గ్రూప్-Jలో భాగంగా అల్జీరియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించి అర్జెంటీనాకు 3-0 తేడాతో ఘన విజయం అందించాడు. అయితే మ్యాచ్‌లో అతడు చేసిన మూడు గోల్స్ కంటే.. తొలి గోల్ అనంతరం మెస్సీ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులను కలిచి వేస్తుంది.
మ్యాచ్‌లో తొలి గోల్ చేసిన వెంటనే మెస్సీ కళ్లలో నీళ్లు కనిపించాయి. సెలబ్రేషన్స్ సమయంలో అతడు కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించడంతో అభిమానులు అయోమయానికి లోనయ్యారు. మ్యాచ్ అనంతరం ఈ విషయంపై స్పందించిన మెస్సీ.. తన భావోద్వేగానికి ఫుట్‌బాల్‌తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. “అవును.. తొలి గోల్ చేసిన తర్వాత నేను ఏడ్చాను. కానీ అది ఫుట్‌బాల్‌కు సంబంధించిన విషయం కాదు. గత కొన్ని రోజులుగా నేను చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాను. అయితే మా జట్టు సభ్యులు, కోచింగ్ సిబ్బంది, మొత్తం అర్జెంటీనా ప్రతినిధి బృందం నాకు అండగా నిలిచారు. వారు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు” అని మెస్సీ వెల్లడించాడు.
టోర్నమెంట్ ప్రారంభానికి ముందు వ్యక్తిగతంగా కొన్ని కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ.. వాటిని పక్కనపెట్టి మెస్సీ మైదానంలో తనదైన ముద్ర వేశాడు. అల్జీరియాపై సాధించిన హ్యాట్రిక్‌తో అర్జెంటీనా విజయాన్ని ఖాయం చేయడమే కాకుండా, తన అంతర్జాతీయ కెరీర్‌లో మరో చారిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేశాడు. ఇది మెస్సీకి 200వ అంతర్జాతీయ మ్యాచ్. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ నమోదు చేసి తన గొప్పతనాన్ని మరోసారి నిరూపించాడు. అలాగే వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో మరో కీలక రికార్డును సమం చేశాడు.

