Site icon NTV Telugu

Earthquake: భారత్‌, నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు

Earthquake

Earthquake

Earthquake: ఉత్తర భారత్‌లో దేశరాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో బుధవారం మధ్యాహ్నం భూమి కంపించింది. పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో రిక్టర్‌ స్కేల్‌పై 3.6 తీవ్రతతో ప్రకంపనలు సంభవించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ పేర్కొంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానాలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం ఉత్తరాఖండ్‌లోని పితోర్‌గఢ్‌కు తూర్పున 143 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భూకంపం ధాటికి ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం.

అదేవిధంగా నేపాల్‌లో కూడా భూకంపం సంభవించింది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు రిక్టర్ స్కేలుపై 4.4 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఇదిలా ఉంటే ఈ ఉదయం పొరుగు దేశం నేపాల్‌లో భూమి స్వల్పంగా కంపించగా.. ఆ ప్రభావం ఉత్తర భారతదేశంలో చూపించినట్లు స్పష్టమవుతోంది. నేపాల్‌లోని జుమ్లాకు 69 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. గత కొన్ని నెలలుగా నేపాల్‌లో తరచూ భూకంపాలు వస్తుంటాయి. అంతకుముందు జనవరి 24న నేపాల్‌లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.గత ఏడాది నవంబర్‌లో, దేశం నేపాల్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది, బుధవారం దోటి జిల్లాలో ఇల్లు కూలిన సంఘటనలో కనీసం ఆరుగురు మరణించారు. అప్పుడు కూడా ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. మరోవైపు చైనా సరిహద్దు ప్రాంతాల్లోనూ నిన్న భూమి స్వల్పంగా కంపించింది.

Read Also: BBC Documentary: భారత్‌కు ఝలక్‌.. బీబీసీని సమర్థించిన యూకే సర్కారు!

దక్షిణ భారతంలోని చెన్నైలో కూడా బుధవారం స్వల్ప భూకంపం సంభవించింది. అన్నారోడ్డు సమీపంలోని వైట్స్ రోడ్ ప్రాంతంలో ఈరోజు స్వల్పంగా భూమి కంపించింది. మూడంతస్తుల భవనంలో ప్రకంపనలు రావడంతో ఉద్యోగులు.. ప్రజలు భయంతో బయటకు వచ్చి రోడ్డుపైకి వచ్చారు. ఈరోజు ఉదయం 10.15 గంటలకు అకస్మాత్తుగా భూకంపం సంభవించింది. భూకంపంపై నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ అధికారి వివరణ ఇచ్చారు. భూకంపం స్వల్పంగానే ఉందని, ఎలాంటి నష్టం జరగలేన్నారు. ఎవరూ ఆందోళనకు గురికావద్దని సూచించారు.

Exit mobile version