Mahanandi Temple: గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పుణ్యక్షేత్రాలతో పాటు అనేక గ్రామాల్లో వన్య మృగాల సంచారం అధికం అయిపోయింది. తిరుపతి, శ్రీశైలం సహా అనేక పుణ్యక్షేత్రాల్లో క్రూరమృగాల సంచారం ఎక్కువైపోయింది. దైవ దర్శనానికి వెళ్లే భక్తులపై దాడులకు పాల్పడుతుండడంతో భక్తులు భయాందోళన మధ్య క్షేత్రాలకు వెళ్తున్నారు. తాజాగా నంద్యాల జిల్లా మహానంది క్షేత్రం పరిసరాల్లో చిరుత హల్ చల్ చేసింది. ఆలయ ఈవో పక్కన ఉన్న విద్యుత్ కార్యాలయం వద్ద చిరుత సంచరించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అడవిలో నుంచి క్షేత్ర పరిసరాల్లోకి చిరుత ప్రవేశించి విద్యుత్ కార్యాలయం వద్దకు చేరుకుంది. కుక్కలు భయంతో గట్టిగా మొరగడంతో విద్యుత్ సిబ్బంది అలర్ట్ అయ్యారు. స్థానికులు , విద్యుత్ సిబ్బంది కేకలు, విజిల్స్ వేయడంతో చిరుత అడవిలోకి పారిపోయింది. భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఆలయ అధికారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. రేపు చిరుత పాద ముద్రలను అటవీ అధికారులు పరిశీలించనున్నారు. చిరుత సంచారంతో భక్తులు, స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కారణమేదైనా పుణ్యక్షేత్రాలో క్రూరమృగాల సంచారం ఇటు భక్తులను, అటు స్ధానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
Read Also: Kerala : కేరళలో బర్డ్ ఫ్లూ.. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడంతో హెచ్చరిక జారీ