గత నాలుగు రోజులుగా క్షణ క్షణం టెన్షన్ వాతావరణం నెలకొంది. భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలు నెలకొన్నాయి. పాక్ పై భారత సైన్యం విరుచుకుపడింది. పాక్ ను కోలుకోలేని దెబ్బకొట్టింది. భారత్ పాక్ వార్ లో తెలుగు జవాన్ మురళీ నాయక్ తో పాటు మరో ఇద్దరు వీరమరణం పొందారు. ఏపీ(AP)లోని సత్యసాయి జిల్లా కల్లితండాకు చెందిన మురళీ నాయక్ జమ్ము కశ్మీరులోని LOC వద్ద పాకిస్తాన్ తో జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు విడిచాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ భౌతికకాయం నిన్న సొంతూరికి చేరింది.
Also Read:Indian Air Force: పాక్ దాడిలో మరో భారత జవాన్ వీరమరణం..
మురళీ భౌతికకాయాన్ని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని గడ్డంతాండ పంచాయతీ కల్లితాండాకు ఆర్మీ అధికారులు తీసుకొచ్చారు. కుమారుడి మృతదేహం చూసి మురళీ తల్లిదండ్రులు బోరున విలపిస్తు్న్నారు. మురళీ భౌతికకాయంను చూసేందుకు స్థానికులు భారీగా తరలి వచ్చారు. చేతిలో మువ్వన్నెల జెండా పట్టుకుని ‘భారత మాతకు జై’, ‘జై జవాన్’, ‘మురళీ నాయక్ అమర్ రహ హే’ అంటూ నినాదాలు చేశారు. కాగా నేడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు నిర్వహించనుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మురళి నాయక్ అంత్యక్రియలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.
