Bird Flu: యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ(ఈఎఫ్ఎస్ఏ) నివేదిక ప్రకారం ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా బర్డ్ ఫ్లూ వ్యాప్తిని ఎదుర్కొన్నట్లు పేర్కొంది. అక్టోబర్ 2021 నుండి సెప్టెంబర్ 2022 వరకు ఏడు దేశాలలో పౌల్ట్రీలో 2,520 సార్లు ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వ్యాప్తిని గుర్తించినట్లు తెలిపింది. ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు ఐదుకోట్లకు పైగా పక్షులను చంపినట్లు వెల్లడించింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ముందస్తుగా వధించిన కోళ్లు, బాతులు, టర్కీలను ఇందులో చేర్చలేదని ఈఎఫ్‌ఎస్‌ఏ తెలిపింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ సాధ్యాసాధ్యలను సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. 2022 వేసవిలో అడవి పక్షులు, పౌల్ట్రీలలో బర్డ్ ఫ్లూ మొదటిసారిగా, అక్టోబర్ ప్రారంభంలో ఆఖరి సారి గుర్తించినట్లు ఈఎఫ్ఎస్ఏ పేర్కొంది. కలుషితమైన పౌల్ట్రీ ఉత్పత్తుల ద్వారా మానవులకు సంక్రమించే ప్రమాదం చాలా తక్కువగా ఉందని తేలింది. వైరస్ పౌల్ట్రీ ఫామ్‌లలోకి వ్యాపించడానికి కారణం నీటి పక్షులు కారణం కావొచ్చని నివేదిక అభిప్రాయపడింది. పౌల్ట్రీ సంస్థలపై వ్యాప్తి రాబోయే రోజుల్లో మరి కాస్త ఎక్కువగా ఉండనున్నట్లు వెల్లడించింది.