Lagadapati Rajagopal: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతే రాజకీయాలకు గుడ్‌బై చెబుతానంటూ ప్రకటించిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు.. ఆ తర్వాత ఎన్నికల సర్వేలు నిర్వహిస్తూ వచ్చిన ఆయన.. గత ఎన్నికల్లో తన సర్వే ఫలితాలకు.. ఎన్నికల ఫలితాలు భిన్నంగా రావడంతో.. అప్పడి నుంచి సర్వేలకు కూడా స్వస్తి పలికారు.. అయితే, త్వరలోనే లోక్‌సభ ఎన్నికలతో పాటు.. ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో.. ఆయన రాజమండ్రిలో ప్రత్యక్షం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.. అయితే, రాష్ట్ర విభజనతోనే నా రాజకీయ జీవితం ముగిసింది.. నేను ఇకపై ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయబోను అని స్పష్టం చేశారు లగడపాటి..
Read Also: Rakul Preet Singh: అల్ట్రా స్టైలిష్ లుక్స్‌తో మతులు పోగొడుతున్న రకుల్ ప్రీత్ సింగ్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్‌తో సమావేశమైన లగడపాటి రాజగోపాల్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనతోనే నా రాజకీయ జీవితం ముగిసింది. నేను ఇకపై ఎన్నికల్లో పోటీ చేసేది లేదన్నారు.. రాజకీయాలకు దూరంగా ఉన్నాను అన్నారు.. రాష్ట్రంలో తమిళనాడు తరహాలో జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ పోయింది.. రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. ఇక, గతంలో మాదిరిగా ఎన్నికల ఫలితాలపై తానేమి సర్వేలు నిర్వహించడం లేదన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనపై త్వరలోనే ప్రజలు తీర్పు చెబుతారని తెలిపారు. మా డ్యూటీలో ఎటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించిన అంశాలు లేవు.. రాజమండ్రి వస్తే ఉండవల్లి అరుణ్‌కుమార్, హర్ష కుమార్ లను కలవడం మామూలే అన్నారు లగడపాటి రాజగోపాల్. మొదట హర్షకుమార్‌ను కలిసిన ఆయన.. ఆ తర్వాత రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశం అయ్యారు. అయితే, ఏపీ రాజకీయాల్లో ఈ మధ్య కీలక మార్పులు జరుగుతున్నాయి.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిన తర్వాత.. సీనియర్ రాజకీయ నేతలతో పాటు.. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు ఆ పార్టీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.. ఈ తరుణంలో లగడపాటి రాజగోపాల్.. రాజమండ్రి పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఏపీ కాంగ్రెస్‌లో జోష్ కనిపిస్తోన్న సమయంలో.. ఈ ముగ్గురు మాజీ ఎంపీల భేటీ హాట్ టాపిక్‌గా మారిపోయింది..