Site icon NTV Telugu

BJP: బీజేపీ లోక్‌సభ అభ్యర్థి హఠాన్మరణం.. పోలింగ్ ముగిసిన కొన్ని గంటలకే కన్నుమూత

Heoi

Heoi

బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ (72) హఠాన్మరణం చెందారు. పోలింగ్ ముగిసిన కొన్ని గంటలకే ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం దేశ వ్యాప్తంగా తొలి విడత పోలింగ్ జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సర్వేష్ సింగ్ బరిలో ఉన్నారు. శుక్రవారం జరిగిన పోలింగ్‌లో ఆయన ఓటు కూడా వేశారు. అనంతరం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోకి ఎయిమ్స్‌కు తరలించారు. అనంతరం ఆయన గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఆయన మరణాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి ధృవీకరించారు.

శుక్రవారం పోలింగ్ ముగిసిన కొన్ని గంటలకే అభ్యర్థి మరణించడంతో యూపీలోని మొరాదాబాద్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. మొరాదాబాద్‌లోని ఠాకూర్‌ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. 2014లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు.

సర్వేష్ సింగ్ మృతి పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ వేదికగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ మరణం షాక్‌కు గురిచేసిందన్నారు. ఇది బీజేపీ కుటుంబానికి తీరని లోటు అని.. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు శక్తిని ఇవ్వాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్టు చేశారు. సర్వేష్ సింగ్ మృతి పట్ల బీజేపీ నేతలంతా విచారం వ్యక్తం చేస్తున్నారు.

సర్వేష్ సింగ్ మృతి పట్ల యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. దు:ఖంలో ఉన్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సర్వేష్ సింగ్ ఆత్మకు శాంతి కూరాలని ప్రార్థిస్తున్నట్లు అఖిలేష్ ట్వీట్ చేశారు.

Exit mobile version