కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి గుండె ఆపరేషన్ జరిగింది. చెన్నైలోని అపోలో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా సర్జరీ నిర్వహించారు. గురువారం చెన్నై అపోలో డాక్టర్లు కుమారస్వామికి నాన్-సర్జికల్ వైద్యం చేశారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ కానున్నారు. హార్ట్ సర్జరీ జరగడం ఇది మూడోసారి కావడం విశేషం.
కుమారస్వామికి సర్జరీ సక్సెస్‌గా జరిగిందని కుమారుడు నిఖిల్ ‘ఎక్స్’ వేదికగా తెలియజేశారు. అభిమానులు, శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో, దేవుని దయతో కుమారస్వామి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కుమారస్వామి ఛాతీ నొప్పి కారణంగా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. కుమారస్వామి సోదరుడు రేవన్న కూడా స్పందించారు. దేవుని దయ వలన తన సోదరుడు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.
ఇదిలా ఉంటే ఇటీవలే కుమారస్వామి.. కేంద్రంలో బీజేపీ పెద్దలను కలిసి కర్ణాటకలో పొత్తు అంశాలు, సీట్ల పంపకాలపై చర్చించారు. బీజేపీతో కలిసి వెళ్లేందుకు కుమారస్వామి సిద్ధపడ్డారు. ఇంతలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. తిరిగి ఇంటికి రాగానే పొత్తుల అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.