NTV Telugu Site icon

KTR: సింగరేణి కార్మికుడి నుంచి మంత్రిగా.. కొప్పుల ప్రస్థానంపై కేటీఆర్ వ్యాఖ్యలు

Ktr

Ktr

KTR: గొప్ప నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించే యువతకు కొప్పుల ఈశ్వర్ ప్రస్థానం కచ్చితంగా స్ఫూర్తిదాయకమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రి, సీనియర్ నాయకులు కొప్పుల ఈశ్వర్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సింగరేణి కార్మికునిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన.. రాష్ట్ర మంత్రి దాకా ఒక్కో మెట్టు ఎదిగిన తీరును రాజకీయాల్లో ఎదగాలనుకుంటున్న యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. 80వ దశకం చివరలో సాధారణ సింగరేణి కార్మికుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన… క్రమంగా కార్మిక సంఘ నాయకుడిగా ఎదిగారన్నారు.

Read Also: Drugs Seized: రాచకొండ కమిషనరేట్‌లో భారీగా డ్రగ్స్ సీజ్..

సింగరేణి కార్మికుల సమస్యల పోరాటంలో చురుకైన పాత్ర పోషించారని.. కార్మిక నాయకుడిగా ఎన్నో ఉద్యమాలు చేశారని.. సింగరేణి కార్మికులకు ఆయన ఎనలేని మేలు చేశారని కేటీఆర్ తెలిపారు. ఆ తర్వాత 90వ దశకం చివరలో ప్రజా జీవితంలో చేరారని.. ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఉద్దేశంతో 2001 లో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారని చెప్పారు. 2004 లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారని.. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలకు ఎంతో సేవ చేశారన్నారు.

కేసీఆర్ ప్రభుత్వంలో చీఫ్ విప్‌గా, కేబినెట్ మంత్రిగా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా పనిచేశారన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో పెద్దపల్లి స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి ఆయన పోటీలో ఉన్నారని.. రాజకీయాల్లో అపారమైన అనుభవం, నిబద్ధత కలిగిన నాయకుడు కొప్పుల ఈశ్వర్ అని కేటీఆర్ వెల్లడించారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన కొప్పుల ఈశ్వర్‌ను మించి నాయకుడు మరొకరు లేరన్నారు. పెద్దపల్లి ప్రజలు ఆయనను ఎంపీగా ఆశీర్వదించి గెలిపిస్తారని ఆశిస్తున్నానని కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.