NTV Telugu Site icon

BRS Rythu Dharna: ఆరు గ్యారెంటీలని చెప్పి.. అర గ్యారెంటీ అమలు చేశారు: కేటీఆర్‌

Ktr

Ktr

తెలంగాణ రాష్ట్రంలో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని అస్సలు వదిలి పెట్టొద్దని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేశారా? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలని చెప్పి.. అర గ్యారెంటీ అమలు చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ఒక్క ఊరిలో అయినా రుణమాఫీ పూర్తిగా అయితే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని సవాల్ విసిరినా సీఎం మాట్లాడలేదని కేటీఆర్‌ పేర్కొన్నారు. చేవెళ్లలో ఉప ఎన్నిక రాబోతుందన్నారు.

శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ‘రైతు ధర్నా’ చేపట్టింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘గత సంవత్సర కాలంగా చూసిన బెస్ట్ జోకును ఈరోజు పేపర్లో చూశాను. తెలంగాణను ఉద్ధరించాను, ఢిల్లీని ఉద్దరిస్తాను అని సీఎం రేవంత్ రెడ్డి రాజధానిలో చెబుతున్నాడు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు చేయలేదు కానీ.. ఢిల్లీలో చేస్తాను అంటున్నాడు. ఫ్రీ బస్ తప్ప ఇచ్చింది ఏమీ లేదు. ఆరు గ్యారెంటీలని చెప్పి.. అర గ్యారెంటీ అమలు చేశారు’ అని కేటీఆర్‌ విమర్శించారు.

Also Read: Jeevan Reddy: రైతు భరోసా ప్రభుత్వం ప్రకటించినా.. బీఆర్‌ఎస్‌ రైతు ధర్నా అంటూ డ్రామా చేస్తోంది!

‘రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టొద్దు. ఒక్క ఊరిలో అయినా రుణమాఫీ పూర్తిగా అయితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని సవాల్ విసిరాను. తెలంగాణలో ఏ ఊరిలో అయినా రుణమాఫీ పూర్తిగా అయితే.. మా ఎమ్మెల్యేలు అందరం రాజీనామా చేస్తామాని చెప్పాను. అయినా కానీ సీఎం మాట్లాడలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతులకు నాట్లు వేసే సమయానికి డబ్బులు పడుతుండేవి. కానీ రేవంత్ రెడ్డి ఓట్ల అప్పుడు రైతులకు డబ్బులు ఇస్తాను అంటున్నాడు. చేవెళ్లలో ఉప ఎన్నిక రాబోతుంది. మీరు చేవెళ్లలో కేసీఆర్ కు ఓటేశారు, ఎమ్మెల్యేని గెలిపించారు. కానీ చేవెళ్ల ఎమ్మెల్యే అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. ఎవరి అభివృద్ధి కోసం వెళ్ళాడో అందరికీ తెలుసు. చేవెళ్లలోనే కాదు తెలంగాణలో పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 2025లోనే పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు వస్తాయి. వాళ్ళను ఓడించాలి. రైతుల తరుపున ఇది ఆరంభం మాత్రమే. 21వ తారీఖున నల్గొండలో మరో రైతు దీక్ష పెడతాం’ అని కేటీఆర్‌ తెలిపారు.