NTV Telugu Site icon

KTR: లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు.. సిద్ధంగా ఉండండి!

Ktr

Ktr

KTR Review Meeting With Chevella BRS Leaders: లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ చేవెళ్ల పార్టీ నేతలకు సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోని మెజార్టీని కాపాడుకుంటూ.. లోక్‌సభ ఎన్నికల్లో ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలన్నారు. ఓడిపోయాం అని నిరాశ పడకుండా.. ముందుకు సాగాలని కేటీఆర్‌ నేతలతో చెప్పారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ నేతలతో సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ రంజిత్‌ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చ సాగింది.

చేవెళ్ల లోక్‌సభ రివ్యూ మీటింగ్‌లో కేటీఆర్‌ మాట్లాడుతూ… ‘లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. నియోజక వర్గాల వారీగా మీటింగ్‌లు ఏర్పాటు చేసుకొని సిద్ధంగా ఉండండి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నియోజక వర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలే ఇంచార్జిలుగా ఉంటారు. 2024 జనవరి 3 నుంచి పార్టీ సమీక్ష సమావేశాలు జరుగుతాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్‌లోని నాలుగు నియోజకవర్గాలలో లక్ష తొమ్మిది వేల మెజార్టీ వచ్చింది. ఈ మెజార్టీని కాపాడుకుంటూ.. లోక్‌సభ ఎన్నికల్లో ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలి. బీజేపీ ధీటుగా ఉంటది, కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వారు కూడా పోటీ ఇస్తారు. ఓడిపోయాం అని నిరాశ పడకుండా ముందుకు సాగాలి’ అని అన్నారు.

Also Read: KA Paul: సీఎం రేవంత్‌ రెడ్డితో కేఏ పాల్‌ భేటీ!

చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి మాట్లాడుతూ… ‘నన్ను చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమని చెప్పారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్. బీఆర్ఎస్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పధకాలు అమలు చేసింది. బీఆర్ఎస్ ఏం చేయలేదని కాంగ్రెస్ చెప్పడం అసత్యం. కాంగ్రెస్ రాష్ట్రంలో 412 హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చ లేదు. చేవెళ్ల పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన లక్షా తొమ్మిది వేల మెజారిటీ కంటే ఎక్కువ వస్తుంది. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని ఆరు నెలల నుంచి కాంగ్రెస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెడతాము’ అని చెప్పారు.

Show comments