సిట్ విచారణకు తాను పూర్తిగా సహకరించాను అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈరోజు తనను ఎవరితోనూ కలిపి విచారించలేదని స్పష్టం చేశారు. నేటి విచారణలో తాను తప్ప ఏ ‘రావూ’ లేడని విమర్శించారు. మరోసారి విచారణకు పిలుస్తామంటే తప్పకుండా తాను వస్తానని సిట్ అధికారులకు చెప్పానని కేటీఆర్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణ ముగిసింది. దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు.. కేటీఆర్ వాంగ్మూలం రికార్డు చేశారు. విచారణ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.
‘సిట్ విచారణకు పూర్తిగా సహకరించాను. ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాలక్షేప కథాచిత్రం నడుపుతున్నారు. కొంతమంది హీరోయిన్లను ట్యాప్ చేసి బెదిరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది వాస్తవమా కాదా అని సిట్‌ను అడిగాను, అది వాస్తవం కాదని సిట్ అధికారులు చెప్పారు. ఏ నటులు మీకు ఫిర్యాదు చేశారని సిట్‌ను ప్రశ్నిస్తే.. నా ప్రశ్నలకు సిట్ అధికారులు సరిగా సమాధానం చెప్పలేదు. ఏవో కొన్ని పేర్లు చెప్పి వాళ్లు తెలుసా అని అడిగారు. ఈ ప్రభుత్వంలో మా ఫోన్లు ట్యాప్ కావటం లేదా? అని సిట్‌ను అడిగాను. లీకులను నమ్మి తప్పుడు వార్తలు రాయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా. మీలాగే మాకు కూడా కుటుంబాలు ఉంటాయి’ అని కేటీఆర్ అన్నారు.
‘ఇది లీకువీరుల ప్రభుత్వం. కేవలం లీకుల మీద నడిచే ప్రభుత్వం. సింగరేణిలో దొంగలు దొరికారని హరీష్ రావు ఆరోపిస్తే ఇప్పటి వరకు స్పందన లేదు. సీఎం సన్నిహితుడు తుపాకీ పెట్టి బెరించారని మంత్రి కూతురు ఆరోపిస్తే దానిపై విచారణ ఉండదా?. ఏఐసీసీ సెక్రటరీ ఓ కాంట్రాక్టర్‌ను బెదిరించారని ఫిర్యాదు చేస్తే చర్యలు ఉండవు. వేధింపులు తప్ప సిట్ అడిగిన దాంట్లో ఏమీ లేదు. ఈరోజు ఎవరితో కలిపి నన్ను ప్రశ్నించలేదు. సిట్ ఆఫీసులో నేను తప్ప ఏ రావు లేడు. ఎన్నిసార్లు పిలిచినా సిట్ విచారణకు వెళ్తాము. పోలీసు వ్యవస్థ సీఎం రేవంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తోంది. భయపడేవాళ్లమైతే టైమ్ అడుగేవాళ్లం, కోర్టుకు వెళ్లేవాళ్లం. నేను సిట్ అధికారులను బెదిరించారన్నది అవాస్తవం’ అని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
