KTR Fires on Pawan Kalyan: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. దేశంలో ఎవరికైనా పార్టీ పెట్టే హక్కు ఉందని, ఎక్కడైనా ఎన్నికల్లో పోటీ చేసే స్వేచ్ఛ ఉందని చెప్పిన ఆయన.. ఏ ప్రాంతంలో రాజకీయాలు చేయాలనుకుంటే ఆ ప్రాంత చరిత్ర, పోరాటాలు, ప్రజల భావోద్వేగాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గతంలో (2023) కూడా తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేశారని, ఆయనను ఎవరూ అడ్డుకోలేదని గుర్తు చేశారు. గత పన్నెండేళ్లలోనో ఆయనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున రాజకీయ సభ నిర్వహించాల్సిన అవసరం పవన్‌కు ఏముందని కేటీఆర్ ప్రశ్నించారు.
ప్రాంతీయవాదం గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘మద్రాస్ రాష్ట్రం నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ దీక్ష కూడా ప్రాంతీయవాదమేనా?. తెలంగాణ ఉద్యమం కూడా ప్రజల ఆకాంక్షల కోసం జరిగిన పోరాటమే. దానిని తప్పుగా చిత్రీకరించడం సరికాదు. దేశభక్తి విషయంలో మాకు ఎవరి దగ్గరా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు గుజరాత్‌కు వెళ్లిపోయాయి. అదే సమయంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమానికి మేము మద్దతు ఇచ్చాము’ అని కేటీఆర్ గుర్తు చేశారు.
‘పవన్ కళ్యాణ్‌ను ఉప ముఖ్యమంత్రిగా గౌరవిస్తాం, నటుడిగా అభిమానిస్తాము. పవన్ ఇంటికి వస్తే బిర్యానీ పెట్టి మర్యాద చేస్తాం. కానీ మా సచివాలయంలో కూర్చొని తెలంగాణ గురించి తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోం. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా చేశారు. తెలంగాణకు అసలైన ఓజీ కేసీఆర్. తెలంగాణ ఒక్క ఓజీ చాలు, ఇంకొకరు అసవరం లేదు. తెలంగాణ రాష్ట్రం సులభంగా వచ్చినది కాదు. వేలాది మంది త్యాగాలు, దశాబ్దాల ఉద్యమ ఫలితంగా రాష్ట్రం ఏర్పడింది. పవన్ కళ్యాణ్ అయినా, మరెవరైనా దేశంలో ఎక్కడైనా పోటీ చేయవచ్చు. అయితే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గౌరవించాల్సిందే. ఖచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే. ఈ రాష్ట్రం కోసం జరిగిన పోరాటాన్ని ఎవరూ తక్కువ చేసి చూడలేరు’ అని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
