KTR slammed Revanth Reddy: భారత ఆర్మీపై రేవంత్ రెడ్డి చేసిన నీచమైన కామెంట్స్ ని వెనక్కి తీసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. భారత ఆర్మీకి క్షమాపణ చెప్పాలన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం ఆర్మీని రేవంత్ రెడ్డి వాడుకోవడంపైన కేటీఆర్ మండిపడ్డారు. సైన్యంలో చేరి, తమ ప్రాణాలను పణంగా పెట్టడానికి అపారమైన కృషి, అంకితభావం, నిబద్ధత, దేశంపై ప్రేమ అవసరమన్నారు. యూనిఫామ్ ధరించిన మన సైనికులు అత్యంత కఠినమైన పరిస్థితులలో సరిహద్దులో కష్టపడుతున్నారు కాబట్టే, మనం సురక్షితంగా ఉంటూ, రాజకీయాలు చేసుకోగలుగుతున్నామని హితవు పలిచారు. ఆర్మీ సరిహద్దుల్లో ఉండటం వల్లనే మనమంతా సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నాం.. కుటుంబాలతో జీవించగలుగుతున్నామన్నారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి కోసం భారత సైన్యాన్ని అవమానించడం రేవంత్ రెడ్డికి సరికాదన్నారు.
ఇప్పటికే తన కామెంట్స్ తో నీచమైన స్థాయికి చేరిన రేవంత్ రెడ్డి, ఎన్నికల లబ్ధి కోసం ఆర్మీపై కామెంట్స్ చేసి మరింతగా తన స్థాయి దిగజార్చుకున్నారని కేటీఆర్ విమర్శించారు. “మీరు భారత సైన్యాన్ని కించపరిచి, పాకిస్తాన్‌ను ఏ ఉద్దేశంతో పొగుడుతున్నారు? మీరు భారత సైన్యానికి క్షమాపణ చెప్పి, మీ మాటలను వెనక్కి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. డబ్బు సంచులతో దొరికిన రేవంత్ రెడ్డికి గుండాలు రౌడీషీటర్లు అంటేనే గౌరవం.. అలాంటి రేవంత్ రెడ్డి శత్రుదేశాన్ని గౌరవించడం ఆశ్చర్యమేమీ లేదు.. ఇప్పటికైనా సైన్యాన్ని అవమానించడం రేవంత్ రెడ్డి ఆపాలి.. తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకైన మర్యాదగా ప్రవర్తించాలి..” అని కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
