ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ వికెట్ కీపర్ బ్యాటర్ కోన శ్రీకర్ భరత్ (కేఎస్ భరత్) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగభరితమైన పోస్ట్ ద్వారా పంచుకున్నారు. ఈ పోస్ట్‌లో తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తన అంతర్జాతీయ టెస్ట్ అరంగేట్రానికి కారణమైన జాతీయ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు, ఐపీఎల్‌లో తనకు గుర్తింపు తెచ్చిన విరాట్ కోహ్లీకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో భరత్ ఇలా రాశారు: “నా ఐపీఎల్ అరంగేట్రం నాటి కెప్టెన్ విరాట్ కోహ్లీకి నా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి, గుర్తింపు పొందడానికి అవకాశం ఇచ్చినందుకు పెద్ద ధన్యవాదాలు. అలాగే నా టెస్ట్ అరంగేట్రానికి సారథ్యం వహించిన నా భారత కెప్టెన్ రోహిత్ శర్మకు నా కృతజ్ఞతలు. ఆయన హయాంలో టెస్ట్ క్యాప్ అందుకోవడం అమూల్యమైనది, మాటలకు అతీతమైనది. ఇక నా భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ సర్ అందించిన మార్గదర్శకత్వం ఇండియా-ఎ స్థాయి నుండి భారత జట్టు వరకు మరువలేనిది” అని పేర్కొన్నారు.
అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం..
భారత జట్టు తరఫున కేఎస్ భరత్ కేవలం టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రమే ప్రాతినిధ్యం వహించారు. ఆయన మొత్తం 7 టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. అయితే.. 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో వృద్ధిమాన్ సాహా గాయపడటంతో భరత్ మొదటిసారి ‘సూపర్ సబ్’ (సబ్‌స్టిట్యూట్ వికెట్ కీపర్)గా మైదానంలోకి అడుగుపెట్టారు. ఆ మ్యాచ్‌లో వికెట్ల వెనుక ఆయన చూపిన అద్భుతమైన ప్రతిభ అందరినీ ఆకట్టుకుంది.
ఆ తర్వాత 2023లో రిషభ్ పంత్ ఘోర కారు ప్రమాదానికి గురై జట్టుకు దూరం కావడంతో, ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ భరత్ వికెట్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. లండన్‌లోని ది ఓవల్ మైదానంలో జరిగిన 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్లో కూడా ఆయన భారత్ తరఫున ఆడారు. భరత్ తన చివరి అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్‌ను ఫిబ్రవరి 2024లో ఇంగ్లాండ్‌పై తన సొంతగడ్డ అయిన విశాఖపట్నంలో ఆడారు. తన 7 టెస్టుల కెరీర్‌లో ఆయన 20.09 సగటుతో 221 పరుగులు చేశారు, అందులో అత్యధిక స్కోరు 44 పరుగులు.
డొమెస్టిక్ క్రికెట్‌లో సంచలన రికార్డులు..
అంతర్జాతీయంగా పరిమిత అవకాశాలు వచ్చినప్పటికీ, దేశవాళీ (డొమెస్టిక్) క్రికెట్‌లో భరత్ రికార్డులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఆయన మొత్తం 113 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 36.53 సగటుతో 6,102 పరుగులు సాధించారు. ఇందులో 11 సెంచరీలు, 34 ఫిఫ్టీలు ఉన్నాయి. ముఖ్యంగా 2014-15 రంజీ ట్రోఫీ సీజన్‌లో గోవా జట్టుపై 308 పరుగులు చేసి, రంజీ చరిత్రలోనే ‘ట్రిపుల్ సెంచరీ’ చేసిన మొదటి వికెట్ కీపర్ బ్యాటర్‌గా భరత్ చరిత్ర సృష్టించారు. అలాగే 83 లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో 8 సెంచరీలు, 10 ఫిఫ్టీల సహాయంతో 2,692 పరుగులు చేశారు.
ఐపీఎల్ కెరీర్..
ఐపీఎల్ 2015 వేలానికి ముందు ఢిల్లీ డెర్‌డెవిల్స్ భరత్‌ను కొనుగోలు చేసినప్పటికీ, ఆ సీజన్‌లో అతనికి ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ఆయన అద్భుతంగా రాణించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఒక ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఆవేష్ ఖాన్ వేసిన చివరి బంతికి సిక్స్ కొట్టి ఆర్‌సీబీకి విజయాన్ని అందించడమే కాకుండా, ఆ మ్యాచ్‌లో 52 బంతుల్లో 78 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆడే అవకాశాలు మాత్రం చాలా పరిమితంగానే వచ్చాయి.
ప్రస్తుతానికి అంతర్జాతీయ క్రికెట్, బీసీసీఐ (BCCI) పరిధిలోని మ్యాచ్‌ల నుండి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన భరత్, తన భవిష్యత్తు ప్రణాళికల గురించి మాత్రం ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అమూల్యమైన జ్ఞాపకాలతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ ఆంధ్ర క్రికెటర్ భవిష్యత్తు మరింత బాగుండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
