ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ముగిశాయి. నలుగురు వైసీపీ అభ్యర్ధులు ఏకగ్రీవం అయ్యారు. రాజ్యసభ ఎంపీలుగా వైసీపీ నుంచి నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు తెలిపారు. అసెంబ్లీ సెక్రటరీ చేతుల మీదుగా డిక్లరేషన్ సర్టిఫికెట్లు అందుకున్నారు విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, కృష్ణయ్య, బీద మస్తాన్ రావు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ… రాజ్యాధికారంలో బీసీలకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
బీసీలకు మాటలు కాకుండా చేతల్లో అభివృద్ధి చూపిస్తున్నారు.సీఎం జగన్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.పేద కులాల సమస్యలు పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పించారు.రాజకీయ కారణాలతో నాపై కేసు పెట్టారు.బాధితుల పక్షాన పోరాటం చేయటం నా నైజం.నాపై కేసు పెట్టిన వ్యక్తి చాలా మంది దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేసాడన్నారు.
ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు అభివృద్ధికి కృషి చేస్తాం. రాష్ట్ర ప్రయోజనాల కోసం 30 మంది ఎంపీలు పాటు పడతాం. రాష్ట్రానికి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇచ్చిన కుటుంబానికి రుణ పడి ఉంటానన్నారు. ఎంపీ బీద మస్తాన్ రావు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. సీఎం అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తాం అని చెప్పారు.
మూడేళ్ళలో లక్షా 46 వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు పెట్టారని, అప్పు చేసి పేదలకు సంక్షేమం చేయకూడదని ప్రతిపక్షాలు చెప్పగలరా? అని ఆయన ప్రశ్నించారు. మరో ఎంపీ నిరంజన్ రెడ్డి తనకు ఎంపీ పదవి కట్టబెట్టినందుకు సీఎం జగన్ కు,పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి నా తరపున చేయగలిగింది చేస్తానన్నారు.
Rajyasabha Elections: ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం